పుట:Navanadhacharitra.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

నవనాథచరిత్ర

మెలుపు మీఱఁగ మెట్టి ◆ మెల్లనె నడచి
యరిగి చిత్రాంగి య ◆ భ్యంతరగృహము
కరమొప్పఁ జొచ్చి యా ◆ కపటాత్మురాలి
చందంబుచూచి వి ◆ స్మయమున మునిఁగి
డెందంబులోనఁ బా ◆ టిల్లిన భీతిఁ
బలికె నిదేలయో ◆ పద్మపత్రాక్షి!
ఎలమి నల్లంత నా ◆ కెదురుగా వచ్చి
మొలకనవ్వులు చేసి ◆ ముదమురంజిల్లఁ
బొలయు నీమెఱుఁగు చూ ◆ పుల నివాళించి
యుపచారములు పెక్కు ◆ లొనరింతు వేమి
నెపము నా కిదె నేఁడు ◆ నీవొవరుపవు
ముదిత నాయెడఁ దొల్లి ◆ మోహంబు లేదు
మృదుభాషణలు లేవు ◆ మేలంబు లేదు
శృంగార మలవడఁ ◆ జేయక చెలుల
సంగడి మెలఁగక ◆ చనవుగాఁ జదువు
శుకముఁ గైకొనక మిం ◆ చులు దొంగలించు
ముకురంబు చూడక ◆ మురియుచు నడచు
రాయంచ నొల్లక ◆ రత్నవిపంచి
వాయించ సొగయక ◆ వాసన మీఱు
పరువంపుఁ బూబంతి ◆ పట్టక ప్రోది
పురినెమ్మియాటయిం ◆ పులును గైకొనక
జగతీతలంబున ◆ శయనింప నేల
తగు హంసతూలికా ◆ తల్పంబు గలుగఁ
గడుమైలపుట్టంబు ◆ గట్ట నీ కేల
మడఁకమాయనితులాం ◆ బరములుఁ గలుగ
నెవ్వరు నీదెస ◆ నెగ్గాచరించి
రెవ్వరు నీతోడ ◆ నెదురు భాషించి
రేతరితనమున ◆ నింతి నీమీఁదఁ
బోతుటీఁగకు నైన ◆ పొలసి పోరాదు
లోలాక్షి నీదెస ◆ లోఁగక జుట్టు
వ్రేలి నెవ్వరుఁ జూప ◆ వెఱతు రెప్పుడును
అలుకుచు నామంత్రు ◆ లతివ నీయాజ్ఞ
తలమోచి తీర్తురు ◆ తడయక పనులు