పుట:Navanadhacharitra.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

x


అనుచోట 'మతిమంతుఁ డెల్లనమంత్రిపుంగవుని' యని దిద్దుట కవకాశము కలదనియుఁ గావున నెల్లన యనియే యాతని తండ్రిపేరగుననియు వీరేశలింగం పంతులుగారు నిర్ధారణచేసిరి. నవనాథచరిత్రము తాళపత్రగ్రంథమున 'అనుజాతుం డగు నయ్యల మాంబ కూర్మి, తనయుఁడు' అనుపాఠ మొకటి కలదు. ఇదియు సందర్భశూన్యమగుటచే సంస్కరణీయమే. ఇందెల్లయ యని గాక అయ్యల (మాంబ) అనురూపమే కనఁబడుచుండుటనుబట్టి గౌరన తండ్రి పేరు 'ఎల్లయ' అనుటకంటె 'అయ్యలార్యుఁ' డనుటయే సత్యమునకుఁ జేరువయై యుండునని యాతాళపత్రగ్రంథపాఠము "అనుజాతుఁ డగు నయ్యలామాత్యు కూర్మి. తనయుఁడు" అని సంస్కరింపఁ బడినది. హరిశ్చంద్రద్విపదలోని “తగిన తమ్ముఁడు యశోధనుఁ డెల్లమంత్రి” అనునది సంస్కరింప వీలులేనిపాఠముగాఁ దలంప నక్కఱలేదు. “తగిన తమ్ముఁడు యశోధనుఁ డయ్యలార్యుఁ” అని గాని, “తగిన తమ్ముని యశోధను నయ్యలార్యుఁ జెట్టపట్టంగ నోచిన భాగ్యవతికి” అని గాని సంస్కరించుట దుస్సాధ్యము కాదు. ఈతఁడు రచించిన 'లక్షణదీపిక' యను గ్రంథములో-

"మంత్రిచూడామణేస్తస్య సోదర స్యాయమ ప్రభోః
 గౌరనాఖ్య ఇతిఖ్యాతః తనయో నయకోవిదః"

అని యున్నపాఠమును బట్టి చూచినను 'అయమప్రభోః' అనునది 'అయలప్రభోః' అనుదానికి వ్రాయసగాని పొరపాటయి యుండు ననియు, 'ఎల్లయ' అనుదానిని సూచించునది గాలేదనియుఁ దలంపనగును. ఈ గ్రంథముననే ప్రథమపరిచ్ఛేదాంతమునఁ గల యీ క్రింది గద్య యీ విషయమును మఱింత స్పష్టపఱుచుచున్నది:-

"ఇతి కవినుత వితరణ విజితపారిజాత పోతనామాత్య సహజాత చాతుర్యగుణాభిరామ శ్రీమదయ్యలుమంత్రిశేఖర గర్భరత్నాకర శ్రీ గౌరనార్య విరచితాయాం లక్షణదీపికాయాం ప్రథమః పరిచ్ఛేదః॥" ఇట్లిచ్చట అయ్యలుమంత్రి యనియే వ్రాఁతలోఁగూడ స్పష్టముగఁ గనఁబడుచున్నది. కావున గౌరనమంత్రి తండ్రిపేరు అయ్యలామాత్యుఁ డనియే నిశ్చయింపవచ్చును.

కవికాలము:

ఈ అయ్యలామాత్యుఁడు సింగయమాధవ క్షితిపాలునకు మంత్రియైన పోతరాజునకుఁ దమ్ముఁడు. సింగయమాధవ క్షితిపాలుఁడు 15-వ శతాబ్దిని రాచకొండ నేలిన రేచర్లవంశాంబుధి పూర్ణచంద్రుఁడగు సర్వజ్ఞ సింగమనాయని కొడుకనియు, నాతనియొద్ద మంత్రిగా నున్న పోతరా జీగౌరనపెదతండ్రియె యనియు, నీతనిచే రచింపఁబడిన లక్షణదీపిక యందలి యీ క్రింది శ్లోకములనుబట్టి తెలియుచున్నది:-