పుట:Navanadhacharitra.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxv

భువనేశ్వరుఁడు యజ్ఞముచేయుచుండఁగా మునీశ్వరులతోఁగూడి యీ కుమారుఁడచ్చటకుఁ బోవుటయు యజ్ఞ భూమికడ మునిశిష్యులతో బంతులాడుచున్న యీ కుమారుని శోభావతి చూచి మోహించి, యాతనిబంతి తన చేటికచేఁ దెప్పించికొనెను. బంతి యడుగఁబోయిన చంద్రశేఖరునికిని శోభావతికిని పావుర మడుగంబోయిన సారంగధరునికి చిత్రాంగికి జరిగిన వృత్తమె జరిగినది. శోభావతీ ప్రేరణంబున రాజు చంద్రశేఖరుని కాలుసేతులు తలారులచేఁ దఱిఁగించెను. మత్స్యేంద్రనాథస్మరణముచే నాతఁడు కాలుసేతుల మరలఁ బడసి తల్లియొద్దకుఁబోయెను. రాజు తథ్యమును దెలిసికొని శోకింప మత్స్యేంద్రనాథుఁ డాతనిచేఁ బ్రాయశ్చిత్తముగా నొక శివాలయము నిర్మింపఁ జేసెను. అదియే బదరికాశ్రమమున భులేశ్వర మను పేర నున్న శివాలయ మఁట.

వీనినిఁ బోలినకథ యొకటి కొంత భేదముతోఁ గన్నడభాషలోఁ గూడ 'కుమార రాముని కథ' యను పేరుతోఁ బొడసూపుచున్నది. పదునాల్గవశతాబ్దిని కంపిలిరాయఁ డను రాజొకఁడు హంపీ సమీపమునఁ గల కంపిలినగరము పాలించుచుండెను. ఈతనికిఁ గుమారరాముఁడను కుమారుఁడొకఁడు కలడు. ఈతఁడు మహాశూరుఁడు. బాహుబలపరాక్రమశాలి. దిగ్విజయార్థము బయలుదేరి యనేకులగు రాజుల నోడించి, తండ్రికిఁ గప్పముగట్టునట్లు చేసెను. మిక్కిలి బలవంతుఁడగు బళ్లాలరాజు నెదుర సమకట్టి ఓరుగల్లు ప్రతాపరుద్రుని సహాయమును వేఁడ, నాతఁడందుల కొల్లనందున నాతనితోఁబోరి ప్రతాపరుద్రకుమారుని బంధించి పిదపవానిని విడిచిపుచ్చి, ఢిల్లీసుల్తాను సాయమును గోరెను. ఒకనాఁడు కంపిలిరాయఁడు వేఁటకై యరణ్యమునకుఁ బోయిన సమయమున కుమారరాముఁడు స్నేహితులతోఁ జెండ్లాట నాడుచుండ నా బంతి విధివశమున రాజు రెండవభార్యయగు రత్నాజిమేడపైఁ బడెనఁట. దానిని తెచ్చుకొనుట కీతఁ డచటికిఁబోయి యామె నడుగఁగా నామె నీతనినిమోహించి, క్రీడాగృహమునకు రమ్మనుటయు, నాతఁడా పాపకార్యమున కంగీకరింపక విదిలించుకొని పాఱిపోయెను. రా జరణ్యమునుండి యింటికి రాగానేరత్నాజి కుమారరాముఁడు తండ్రియింట లేని సమయముఁజూచి తన మేడకు వచ్చి తన్ను బలాత్కరించెనని కొండెములు చెప్పఁగా, రా జామె మాటలను నమ్మి కుమారునికి మరణదండనము విధించెను. మంత్రియగు బయిచప్పు రత్నాజి చేసిన మోసమును దెలిసికొని కుమారు నొక పాతాళగృహమున దాఁచి, యాతని వధింపించితి నని రాజుతోఁజెప్పి యాతనిని సమ్మతింపఁజేసెను. రా జన్యాయముగఁ గుమారుని జంపించె నన్న వార్త లోకమునవ్యాపించెను. ఈ సందర్భమును ఢిల్లీ సుల్తాను దెలిసికొని, కంపలి రాజ్యమును స్వాధీనము చేసికొనుటకై కొంత సైన్యముతో బహదూర్ ఖానునుబంపి, యాతఁడద్దానిని సాధింపలేక పోఁగాఁదానె స్వయముగా వచ్చి కోటను ముట్టడించెను. అప్పుడు కుమారరాముఁడు జీవించియున్నచో శత్రువును సులభముగా