పుట:Navanadhacharitra.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxvi

పాఱఁద్రోలి కోటను రక్షించియుండెడివాఁ డని జనులందఱు రాజును నిందింప సాగిరి. ఆ సమయమున బై చప్పమంత్రి భూగృహమునుండి కుమారరామునిఁ దీసికొనివచ్చి, యాతని ముందిడికొని కోటవాకిలి దెఱచుటయు, నా కుమారరాముఁడు శత్రుసేనలనుఁ జెండాడి, యావలికిఁ బాఱఁద్రోలెను. కాని ఢిల్లీ సుల్తానుసేన లపారముగా నుండుటచే, వారితోఁ బోరాడుచు కుమారరాముఁడు రణరంగమునఁ బ్రాణముల విడువవలసిన వాఁడయ్యెనఁట.

ఇట్లీ కుమారరామ చరితమును కన్నడమున రచించినవాఁడు గంగాధరుఁ డను శైవ కవి. ఈతని కాలము నిశ్చయముగాఁ దెలియకున్నను, పదునాల్గవ శతాబ్ది పూర్వభాగమున ఢిల్లీ సుల్తాన్‌గానున్న మహమ్మద్ బిన్ తుగ్లకు అనునాతఁడు కంపిలిరాయనిపై దండెత్తి యా నగరమును స్వాధీన పఱచుకొనినట్లు, చారిత్రక నిదర్శనములుఁ గలవు. రాజమహేంద్రవరమందు వలెనే అచ్చటను గొన్ని స్థలములను 'చిత్రాంగి మేడ రత్నాంగి మేడ యున్న స్థలము' లని చెప్పిచూపుచుండు వాడకయుఁ గలదఁట. కాలుసేతులు నఱుక బడిన పిదప, సిద్ధుఁడగుటను గూర్చిన గాథ లేకపోయినను, మొత్తముకథలోఁ గొంత సామ్యము లేకపోలేదు. మన సారంగధరుని కథ మహారాష్ట్ర దేశమునకు సంబంధించినదిగా గౌరన చెప్పుచున్నాఁడు. ఈతఁడు శ్రీగిరికవి వ్రాసిన పద్య ప్రబంధమును బట్టిగదా వ్రాసినాఁడు. ఆతఁ డీతనికి పూర్వుఁడై యుండును. మఱియు బౌద్ధ జాతకములలో గూడ, వీనిని బోలిన కథయే గలదఁట. దీనినిబట్టి విచారింపగా, కొన్ని యితిహాస . పురాణములలోని గాథల నాయా దేశములవా రొక్కొక కాలమున తమ తమ దేశములందుఁ బ్రబలిన ప్రసిద్ధపురుషుల కథలతో ముడివెట్టికొని, యా యా స్థలమహత్మ్యములను బ్రకటించు రీతిగా నీ సారంగధరుని కథ మిగులు ప్రాచీనమే యై, దేశ కాలములను బట్టి, పెక్కు మార్పులనుఁ బొంది, యనేకరూపములఁ బొడగట్టుచున్నదని చెప్పఁ దగియున్నది. మొత్తముమీఁద, గౌరనకాలమునాఁటికి సారంగధరునికథతో నాంధ్రదేశము నేలిన చాళుక్య వంశీయుఁడగు రాజురాజునకుఁ గాని, నన్నయభట్టీయమునకుఁగాని సంబంధములే దని నిశ్చయింపవలసి యున్నది.

రచనలు, కవితావిశేషములు.

గౌరనకవి యాంధ్రరచనములలో హరిశ్చంద్రద్విపద ఇదివఱకే ప్రకటింపఁబడి ప్రసిద్ధమై యున్నది. సంస్కృతమున లక్షణదీపిక యను నొక గ్రంథమును గూడ నీతఁడు రచించెను. అందుఁగూడ రేచర్లవంశాంబుధిపూర్ణ చంద్రుఁడగు సింగయ మాధవేన్ద్రునికి మహామాత్యుఁడగు పోతరాజునకు సోదరుఁడైన అయ్యల ప్రభుని తనయుఁ డగు గౌరనార్యు డని చెప్పుకొనియున్న ట్లింతకుఁబూర్వ ముదాహరింపఁ బడిన శ్లోకములను బట్టి తెలి