పుట:Navanadhacharitra.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxiv

సారంగధరుని గూర్చిన కథలు.

మత్స్యేంద్రనాథుని యనుగ్రహమున సిద్ధుఁడై చౌరంగి యను పేరు వహించిన యీ సారంగధరునికథ భిన్నరీతులఁ గానవచ్చుచున్నది. మహారాష్ట్ర భాషలోని నవనాథచరిత్రనుబట్టి రచింపఁబడిన తెలుఁగుగ్రంథములోనీ 'చౌరంగి' పేరు కృష్ణాగరుఁడని కలదు. ఈతఁడు కౌండిన్యనగరాధిపుఁ డగు శశాంగ నృపాలుని పుత్త్రుఁడు. ఈతని పట్టమహిషి మందాకిని. వీరికిఁ జిరకాలము సంతానము లేకుండుటచే వీ రుమాధవుని ధ్యానించి సంగమేశ్వరమున నాతనిఁ బూజింప నా ప్రదేశమున నొకనాఁడు రా జర్ఘ్యం బిడుసమయమున శివవీర్య బలముచే నాతని యంజలీభాగంబున నర్భకుం డుద్భవించెను. ఆతనిం దెచ్చిరాజు భార్య కొసఁగి కృష్ణాగరుఁడని నామకరణం బొనర్చెను. పిదప నీతనికి వివాహముఁ జేయరాజుప్రయత్నము చేయుసమయమున మందాకినీదేవి మరణించుటయు, రాజు కొమరునికై యుద్దేశించిన చిత్రకూట నగరాధిపుని కుమార్తెయగు భుజావంతిని దానెవివాహమయ్యెను. ఈమెయొకప్పుడు నవయౌవనుఁడగు కృష్ణాగరునిఁ జూచి మోహించి, రాజు మృగయావినోదంబున నరణ్యంబునకేగినతఱి యొక చెలికత్తియను బంపి యాతనిం బిలిపించి తన చిత్తంబునఁ గల చిత్తజుని తాపముసు వెలిఁబెట్ట నాతఁ డతిక్రుద్ధుండై యామె ప్రార్థనమును దిరస్కరించి తన యింటికి: బోయెను. పిదప నీ విషయము కృష్ణాగరుఁడు తండ్రి కెఱింగించు నేమో యనుభయముచేఁ బరితపించుండు సమయమునఁ దన చెలికత్తె చేసిన దుర్భోధనలచేనేరంబు కుమారునిపై వైచి, రాజునకుఁ గోపముపుట్టించి,క రపాద ఖండనముఁ జేయించెను. అప్పుడాయూరఁ ద్రిమ్మరుచున్న గోరక్షునాథుఁ డీ విషయము మత్స్యనాథునికిఁ దెలిపి కృష్ణాగరుఁడు శివవీర్యోద్భవుండగుట యెఱింగి, చతురంగ పీఠంబుపై కరచరణంబులు ఖండింపఁబడిన కతంబున నాతనికిఁ జౌరంగనాథనామంబిడి తండ్రి కెఱింగించి వానిందోడ్కొని బదరికాశ్రమంబునకుంజని, యచ్చట ఘోరతపోనియమంబునఁ గరచరణములతోఁ గూడ మహాసిద్ధుల నాతఁడు బడయునట్లుచేసి యనుగ్రహించెను.

చేమకూర వెంకటకవి సారంగధరచరిత్రకుఁ బీఠిక వ్రాయుచు నందా కథకు మూల మనందగిన చౌరంగికథ నవనాథ చరిత్రములం దిట్లు గలదని యీ క్రిందికథను వేదము వెంకటరాయశాస్త్రులుగా రిచ్చియున్నారు. రుద్రపురమున భులేశ్వరుఁడను రాజుగలఁడు. అతనికి చంద్రావతి, శోభావతియును నిద్దఱు భార్యలు, శోభావతి సవతిని వేలార్చుటకై యామెపై ఱంకులుమోపి గర్భిణియగు నామె నరణ్యమునకు వెడలఁగొట్టించెను. ఒక శివాలయముకడ నొకగంధర్వకన్య యీమెకుమత్స్యేంద్రవ్రతమునుపదేశించెను. చంద్రావతియు మునుల యాశ్రమమున నొకసుతునిఁగని, చంద్రశేఖరుఁడని మునులచే నామకరణము చేయఁబడిన యాతనికి మత్స్యేంద్రోపాస్తి నుపదేశించెను. ఒకప్పుడు