పుట:Navanadhacharitra.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

నవనాథచరిత్ర

నడుఁకక వెఱపించి ◆ నాప్రాణవిభునిఁ
దొడిబడఁజంపిన ◆ దోషంబు కతనఁ
దరువాతి భవమునఁ ◆ దరలక గట్టు
దరిఁ బెనుబామవై ◆ దారుణాటవిని
బడియుండు మన్చు శా ◆ పం బిచ్చి యగ్ని
వడిఁ జొచ్చెఁ దనప్రాణ ◆ వల్లభుఁగూడ
నావిప్రవరుఁడ వీ ◆ వాధరారమణుఁ
డౌ వీఁడు తొల్లిఁటి ◆ యా పెనుబాము
కుప్పుసమే ఫణి ◆ కుల మయి తోఁచెఁ
దప్పదు దైవ కృ ◆ తం బట్లుగాన
వలవదు మునివర ◆ వగపు నీ కనినఁ
దెలిసి యాతఁడు ధర్మ ◆ దేవత కనియె
నోవక యీరాజు ◆ కొసఁగిన శాప
మేవిధంబున వీడు ◆ నిటమీఁదఁ దెలియ
నానతి యిమ్మన్న ◆ నామునిపతికి
ధీనుత యాధర్మ ◆ దేవత పలికెఁ
గ్రమముతోనటు గొంత ◆ కాలంబు చనఁగఁ
బ్రమద మారఁగ ముని ◆ పతుల రక్షింప
మీననాథుండను ◆ మేటి సిద్ధుండు
తా నిందుఁ జనుదేరఁ ◆ దత్పదస్పర్శ
కా కుండలాకృతిఁ ◆ గ్రచ్చఱ నుడిగి
కైకొనుఁ దొల్లి యా ◆ కార మానృపతి
సిద్ధదేహం బగుఁ ◆ జెచ్చెర నట్ల
సిద్ధించు నీకును ◆ సిద్ధపదంబు
అరుగుము నీయాశ్ర ◆ యమునకుఁ దొల్లి
తెఱఁగున నని ధర్మ ◆ దేవత చనియె
మునియుఁ గ్రమ్మఱవచ్చి ◆ ముదమున నాకు
ననయము వృత్తాంత ◆ మంతయుఁ జెప్పి
మన్నన మీఱ నా ◆ మదిఁ గుందు వాపి
సన్నుతంబగు నిజా ◆ శ్రమమున కరిగె
నేనును జిరకాల ◆ మీ యేరుమద్ది
మ్రానిపెందలనుంటి ◆ మఱి యిపు డిచటఁ
బావనంబైన మీ ◆ పాదపద్మములు