పుట:Navanadhacharitra.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xx

"తాళపత్ర గ్రంథములఁ బరిశీలింపఁగాఁ దొమ్మిదింట నాపద్యమే లేదు. నన్నయ యాంధ్రఫక్కి నాతనికై దాఱువందల యేండ్ల తరువాత నాంధ్రలోకమున వ్యాపింపఁ జేయుటకుఁ జాళుక్యకులావతంసుఁ డగు రాజనరేంద్రుని కుమారుఁడని చెప్పఁబడిన సారంగధరుఁడు తోడ్పడుట యెట్టిదో భారతరచనా విషయమున నన్నయకు నారాయణభట్టు తోడ్పడుటగూడ నట్టిదిగానె యుండునని తలంపవలసి వచ్చుచున్నది.

ఇట్లిందలి విషయము లన్నియు సందేహగ్రస్తములుగానే యున్నవి. మొట్ట మొదట నన్నయ యాంధ్రఫక్కిని రచించుట, నన్నయ సమకాలికుఁ డని చెప్పుటకు వీలులేని భీమన దానిని గోదావరిలోఁ గలుపుట; కవిరాక్షనుఁడీభీమనయే యైనచో, నాతఁడే మరల నన్నయ భారతములో నేది చెప్పెనో దానినేగాని, సూత్రసంపాదన లేమిచే మఱియొక తెనుఁగుపల్కు, గూర్చి చెప్పరాదని నియమముచేయుట, తరువాత నాంధ్రలక్షణ కర్తయగు కేతన మొదలగువా రాతని కృతు లరసికొని, ఆ ఫక్కి ననుసరించియే తాము రచించియుండి రనుట; చింతామణి రచనమున నన్నయభట్టుకు నారాయణభట్టు సాయపడినట్లే విష్ణువు అప్పకవికి సాయపడుదు నని చెప్పుట; అన్నిటికంటె గొప్పది, సారంగధరుఁడు శైశవమునందు నన్నయ రచించునెడ నేర్చిన యాంధ్రపక్కిని- ఇంత కాలమునుండియు నిచ్చుట కెవ్వరు తగినవారు లేక గాఁబోలుబయలు వెట్టక “మొన్నటి కీలక సమ నా మతంగగిరికడ బాలసరస్వతుల కిచ్చి" దానిని మహిని వెలయించుట !

ఆంధ్రశబ్దచింతామణి యేకారణముచేనైన నేమి నన్నయరచించిన యైదువందల సంవత్సరములవఱకు నామరూపములె లేక బయలుపడక యుండి, 17 వ శతాబ్దమున బాలసరస్వతిచేతఁ బడుటకు అప్పకవి చెప్పిన కలలోని కథయే మూలాధార మైనచో నది యంతయు కల్లయే యని నవనాథచరిత్రమునఁ దెలుపఁ బడిన సారంగధరుని కథ వెల్లడించుచున్న దనవచ్చును. ఏల యనఁగా నీ నవనాథచరిత్రమునుబట్టి సారంగధరుని కాంధ్రదేశముతోఁ గాని, యందు 11-వశతాబ్ది నేలిన రాజరాజవిష్ణువర్ధనుఁడను రాజనరేంద్రునితోఁగాని, యెట్టి సంబంధము నున్నట్లగపడదు. సారంగధరుఁడు మాళవదేశమున మాంధాతపురం బేలు రాజమహేంద్రుఁడను రాజు కుమారుఁడు. ఆంధ్రదేశమున రాజమహేంద్రవరము రాజధానిగా నేలిన చాళుక్య రా జగు రాజరాజవిష్ణువర్ధనునకు సారంగధరుఁడను కుమారుఁ డున్నట్లు నిదర్శనములేదు. ఈతని పుత్రుని పేరు రాజేంద్రచోడుఁడు, ఈతఁడు రాజ్యమునకు వచ్చినపిదపఁ జోడదేశముపై దండెత్తి దానిని జయించుటచేనీతనికి కులోత్తుంగ చోడదేవుఁడను పేరు వచ్చినది. ఈతనితల్లి పేరుఅమ్మంగ దేవి. రాజరాజునకు రేవల్దేవియను మఱియొక భార్య