పుట:Narayana Rao Novel.djvu/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నౌ కా వి హా ర ము

93


మమ్ముకొని కళారాధన మొనర్పనెంచిన వారికి కళాసరస్వతి సాక్షాత్కరింపదు. కళాధిదేవతనే నమ్ముకొన్నచో పొట్టగడవకపోదు. నీ కష్టమంతయు కళకే ధారబోసిననాడే నీవు కళాప్రతిష్టలతో పేరుగాంతువు. ఉద్యోగము లేకపోయెనని చింతింపకుము. నీవు అదృష్టవంతుడవు. కావుననే యీ విధముగా నీకు గళారాధనకు గావలసినంత సావకాశము లభించినది. కళాస్రష్టవగుట కిదియే సమయము. కళారాధకుడవై లోకారాధ్యత గడించుకొనుము.

‘నీకు సహాయ మొనరించుపట్ల నే నేమాత్రము శక్తివంచన చేయనని యెఱుగుదువు, ఒక్కసారి దేశసంచారము చేసి ప్రకృతిలోని బాహ్యాభ్యంతర సౌందర్యముల దిలకించిరమ్ము. ప్రకృతికంటె మంచి గురువు నీకెచ్చటను లభింపదు. విశ్వస్రష్ట కళానైపుణితో మానవ కళావిలాసము పోల్చి చూచుకొనుము. అంతియే కాని విషాదయోగము పాల్పడకుము. ధీరుడవుకమ్ము. నీవు నా దగ్గర దిగవిడిచి వెళ్ళిన చిత్రములు రెంటిని నా స్నేహితులు చూచి సంతోషించి, కొనిపోయినారు. వారు సొమ్మిచ్చిన వెంటనే నీకు పంపుదును.’

ఈ యుత్తరము నారాయణరావుచూచి యాలోచనా నిమగ్నుడయ్యెను. ఆంధ్రదేశమునం దే లలితకళయు వృద్ధియగు నుపపత్తులు కానరావు. ఏనాడు చక్రవర్తులు, మహారాజులు కాలగతులై మాయమైరో యానాటితో నాంధ్రదేశ సౌభాగ్యము మన్నయినది యని యాతడనుకొనెను.

రాజే: ఒరే పరం! ఏదో స్నేహితుడవు. వేస్తున్నావు. నువ్వు చెప్పిన ముక్కల్లా సరేనని ఊరుకున్నాము. నా కెపుడు తిన్నగా అర్థం అవలేదు. ఏమిట్రా మీ బొమ్మలవిషయం? ఆ వంకరటింకర మనుష్యులేమిటి, ఆ విపరీతపు రంగులేమిటి? ఏమిటీ బెంగాలు సాంప్రదాయం?

పరం: అయితే చిత్రలేఖన ఎల్లా ఉండాలంటావు?

రాజే: ప్రకృతి ననుసరించి ఉండనక్కరలేదట్రా?

నారా: అంటే నీ ఉద్దేశం ఏదో విపులంగా చెప్పరా?

రాజే: రవివర్మ బొమ్మలు తీసుకో, వాటిల్లో మనుష్యులు మన మనుష్యుల్లా ఉన్నారు.

లక్ష్మీపతి: కళ సృష్టే కాని అనుకరణంకాదు, అని కాదూ మీ యిద్దరూ అనేది నారాయణా?

నారా: అవును బావా. రవివర్మ మహావిష్ణువుకు శివుడికి నాలుగు చేతులు వున్నట్లు చిత్రించాడుగదా, అల్లా ప్రకృతిలో ఉన్నాయా? లేవు. మఱి ఎందుకు వేశాడు? పోనీ పాశ్చాత్య చిత్రలేఖకుణ్ణి తీసుకో. రాఫెలు రెక్కలతో ఎగిరివచ్చే దేవమూర్తుల్ని చిత్రించాడు. మనుష్యులకు ఎక్కడైనా రెక్కలుంటాయా?