పుట:Narayana Rao Novel.djvu/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

నా రా య ణ రా వు

అక్కడ దారిదొరక్కపోతే ఇదికాదురా అని వాళ్ళూ మనదారికే వస్తారు. పరమాత్మసాధనలో వాళ్లు ప్రతిదినమూ అనుభవసిద్ధం చేసుకొంటున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా ఇది బుద్ధిగ్రాహ్యం కాదురా అని తెలుసుకొని, దూరదూరాన అఖండజ్యోతిని దర్శిస్తున్నారు. అప్పుడే ఎయిన్‌స్టీన్, ఎడింగ్టను వంటి సాధకులు బయలుదేరారు. పూర్వం మనవాళ్లెప్పుడో ఆ నిత్యపదార్థాన్ని యోగసాధనల చేత చేరారు. ఇప్పుడా మార్గాలన్నీ చీకటితోనిండి దుర్భేద్యాలుగా వున్నాయి. పాశ్చాత్య సాధకులు తిరిగి విజ్ఞానదీపం వెలిగించి ఆదారి కోసం వెదుకుతున్నారు. వాళ్లు సంపాదించిన విజ్ఞానమార్గంలో దానికి రాచబాట వేస్తున్నారు. అంతేకాని మావాళ్ళకు ఇవన్నీ పూర్వమే తెలుసునంటూ మనం చంకలు కొట్టుకుంటూ కూచుంటే మనం యిక్కడేవుంటాం. వాళ్లు పురుషకారపరులు, మనం పండితమ్మన్యత్వం చేత తమస్సులో పడివున్నాము.’

ఇట్టి చర్చలు తరచు జరుగుచు, రాజారావు నారాయణరావుల మైత్రికి దోహదము సల్పుచుండెడివి.

రాజారావు ప్రపంచములో దిరుగనేర్చినవాడుకాడు. మిత్రులతో గలసి మెలసి తిరుగక వేఱుగా నుండును. సహాధ్యాయినులగు యువతులను మోమెత్తి చూడడు. జుట్టు కట్టు మున్నగు వేష భాషలలో నాతడు శుద్ధ శ్రోత్రియుడు. వేషధారులగు తోడి నాగరిక విద్యార్థు లాతని గాంచి పల్లెటూరి సరుకనియు, ఛాందసుడనియు లోలోన నవ్వుకొనుచున్నను, సహాధ్యాయినులాతని వింతమృగమువలె జూచుచున్నను, రాజారా వా పెదవి విరుపులను, అవహేళనములను సరకుగొనక సంచరించెడివాడు.

అతనితో గాఢపరిచయమున్న కతిపయమిత్రులుమాత్ర మాతని సరళహృదయము, వినయశీలము, మధుర స్వభావము, గార్యదీక్షయు నెఱింగి యాతని నెంతయు ప్రీతిమై మన్నించుచుందురు.


౨౧ ( 21 )

నౌకావిహారము

నారాయణరా వత్తవారింట మనుగుడుపులు గుడుచు మూడవరోజున నాతని యుత్తరముల ప్రకారము రాజారావు, పరమేశ్వరమూర్తి, లక్ష్మీపతి వచ్చినారు. జమీందారుగారు, నాడు తాను రైలులో చూచిన మిత్రులందరినీ యల్లునితోబాటు మనుగుడుపులన్నినాళ్లు తనయింట విందులకు రండని ఆదరపూర్వకముగ నాహ్వానించెను. ఆ విధమున నల్లునిచేగూడ వారికి వ్రాయించెను.

ఆ రోజంతయు రాజేశ్వరరావుగూడ వారితోగడిపెను. చిత్రలేఖనవిద్య పూర్తిగావించి నిరుద్యోగియై కాలముగడపు పరమేశ్వరమూర్తి తనకు గురువగు అవనీంద్రుడు పంపిన యుత్తరము స్నేహితులకు జూపించెను. ‘పొట్టకై ఎవరికో