పుట:Narayana Rao Novel.djvu/353

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

352

నారాయణరావు

నళిని: మన బోగమువాళ్ళ నాట్యంకన్న బాగుందా?

ఇంతలో రాజారావు, నారాయణరావు, యజ్ఞనారాయణశాస్త్రి యచ్చటికి వచ్చిరి. లక్ష్మీపతి దొడ్డి మరల ఎప్పటియట్లు సర్దించుచు మోటారుబస్సుల మీద సామాను పంపించి వేయుచుండెను. జమీందారుగారును భోజనమున కక్కడనే యున్నారు. ఆయనయు వచ్చి యా హాలులో గూర్చుండెను.

పర: ఏవమ్మో, మనవాళ్ళ నాట్యం అంటే వేళాకోళం కాదుసుమా!

ఆరాత్రి డాక్టరు రంగాచార్యుల గారికిని, తదితర వైద్యులకును, అనేకుల మిత్రులకును విందును, విందు పూర్తియైన వెనుక శ్రీ వేదవల్లి నాట్యమును నారాయణు డేర్పాటుచేసినాడు.

నళిని: ఏమిటి మరి! దక్షిణాది గణికలు వేసే వేషం విపరీతం. మొన్న కవితాసభలో చూచిన భాగవతం విపరీతం. మనదేశం నేను చూడలేదా, మన వేశ్యల తెయితెక్కలు నేను చూడలేదా? (అని విరగబడి నవ్వును.)

పర: అదేమిటి నళినీ! నీకు లలితకళ లంటే తెలియదన్నమాట.

నారా: చెప్పరా వాళ్ళకి! వెనకకూడా నేను ఒక చిన్న ఉపన్యాసం ఇస్తే, తల ఊపింది నళిని. శ్యామ, రోహిణీ అర్థం చేసుకున్నారు.

నళిని: అది నీ లోటుకాదు అన్నయ్యా! నాలుగు నిమిషాలలో ఏమిటో ఏమిటో గుప్పేస్తే అర్థంకాలేదు.

జమీం: నాకు చిన్నతనాన్నుండీ వీరేశలింగంపంతులుగారి శుశ్రూష వల్ల భాగవతం అంటే, నాట్యమంటే విపరీతమైన అసహ్యం. ఏదయ్యా పరమేశ్వరమూర్తిగారూ! దానినిగురించి మీ అభిప్రాయం చెప్పండి.

ఇంతలో సుబ్బారాయుడుగా రచ్చటకు వచ్చుటయు, వారికి నారాయణరావు మంచి దిండుల కుర్చీ నిచ్చి తాను కూర్చుండెను.

సుబ్బా: ఏమిటి బావగారూ, నాట్యం అంటున్నారు?

జమీం: (నవ్వుచు) పరమేశ్వరమూర్తి గారు నాట్యంలో ఉండే అందాలు చెపుతానంటే చెప్పమంటున్నాను.

సుబ్బా: మా చిన్నతనంలో మాకు భరత శాస్త్రంలో ఉండే అందాలు కూడా నేర్పేవారు బావగారూ! బోగంమేళంలో మేము కూర్చుంటే గణికలకు హడలు. సమస్తమైన కళలు మానాన్నగారికి తెలుసును. మా చిన్నవాడు మా నాన్నగారి పోలికేకదండీ. మా నాన్నగారంటే హడలు మాకు. ఆయన సంగీతాలు పాడితే లోకాలు మూర్ఛిల్లేవి. తొంబదిఅయిదేళ్ళ వృద్ధుడై పొలంలో పనిచేసుకొని ఇంటికివచ్చి, స్నానంచేసి, భోజనం చేసుకుని, రాత్రి రెండో ఝామువరకు త్యాగయ్య కృతులు పాడుతూ ఉంటే ఊరుజనం అంతా ఆక్కడే ఉండేవారు. త్యాగరాయగారిని ఎరుగును. ఆయన ప్రియశిష్యుడే మా నాన్నగారు, ఆ సంప్రదాయం సరిగా ఉన్నదీ లేనిదీ నాకు తెలుసును,