పుట:Narayana Rao Novel.djvu/352

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒపెరా

351

నారాయణరావు వారి నమితగౌరవ మొనరించి, యాదరించినాడు. పరమేశ్వరుడు వీలయినప్పుడెల్ల రోహిణితో నేదేని మంతనమాడును. వారితోబాటు పెక్కురు వనిత లాహ్వానింపబడినారు. చాలామందివచ్చి వారితోపాటే గూర్చుండిరి.

అల్పాహారవిందు పూర్తియైన వెనుక భోజనమునకు గూడ నళినీ, సరళా, రోహిణులు నారాయణరావింట నాగిపోయిరి.

శ్రీరామమూర్తికి వీరిని జూచినకొలదియు నాశ్చర్యముగ నుండెను. అయినను రాజమహేంద్రవరములో జదువునప్పుడు శ్రీ వీరేశలింగాఖ్యుని బోధనలు వినియున్నవాడగుటచే మనస్సు సమాధానము చేసికొనెను. అతనికి సరదాపుట్టి వారితో సంభాషణ నారంభించెను.

శ్రీరా: మీ అక్కయ్యగారి పరీక్ష లవుతున్నాయట కాదాండి?

నళిని: అదేవిటి పెద్దన్న గారూ! మమ్ము ‘మీరు’ అని గౌరవం చెయ్యాలా?

రోహి: మా పెద్దవదినగారిని దీసుకొని రాలేదే?

శ్రీరా: సంసారం పెద్దది. మా యింటిదగ్గిర ఎవ్వరూ ఉండకపోతే ఎలాగు? నేను కొత్తపేట రెండుసారులు వెళ్ళివచ్చాను. అమలాపురం పెద్ద కేసులు ఉంటే చూచుకోడానికిన్నీ వెళ్లానండీ?

నళిని: అదేమిటండీ అన్నగారూ, మీరు మళ్ళీ ‘అండీ అండీ’ అంటున్నారు? అల్లా అయితే మీతో మాట్లాడం.

శ్రీరా: క్షమించండి, కాదు క్షమించమ్మా, నువ్వు పరీక్షలో బాగా వ్రాశావా?

నళిని: తప్పకుండా నెగ్గుతానని ధైర్యం ఉంది. అమలాపురంలో బాలికలకు ఉన్నత పాఠశాల ఉన్నదా అన్నగారూ?

శ్రీరా: లేదమ్మా. అక్కడ ఎవరు చదువుకుంటారు?

నళిని: ఎవ్వరూ లేరండి? ఆశ్చర్యం!

రోహిణి: బాగా ఉంది నళిని, చెన్నపట్టణంలో మాత్రం ఏమాత్రం ఉన్నారేమిటి?

ఇంతలో పరమేశ్వరు డచ్చటికివచ్చి రోహిణీ దేవిని జూచి ‘చెల్లీ! మీరు ఇంగ్లీషు నాట్యమండలి నాట్యం చూచుటకు ఎల్ఫిన్ స్టన్ వెళ్ళినారా’ యని యడిగినాడు.

రోహి: లేదన్నయ్యా! బాగా ఉన్నదా? నిన్న మీరు వెళ్ళినారట కాదూ. శారద వదిన చెప్పింది.

పర: వెళ్ళాం. ఇదివరకు నేను సినీమాలలో చూచాను. వాటికన్న బాగుందమ్మా.