పుట:Narayana Rao Novel.djvu/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

నా రా య ణ రా వు

రూపాయలిచ్చి పెద్దవి చేయించినాడు. తన గది యలంకరించుకొన్నాడు. ఆమె చిన్న చిత్రమొకటి తీయించి, తన యుంగరములో నిమిడించుకొన్నాడు. ఇంకొకటి వాచిగోలుసులో బెట్టుకొన్నాడు. ఇక నేమి! లోపల బయట నంతట పుష్పశీలయే, విశ్వమెల్ల బుష్పశీలామయమే.

వీరిరువురి సంబంధము నెమ్మదిగా లోకమెల్ల బ్రాకుచు ప్రవహించుచున్నది.

పుష్పశీలకు రాజేశ్వరుడన్న వెఱ్ఱియెత్తిపోవుచున్నది. భర్తకుగాని ఇంటిలోని ముసలమ్మకు గాని తెలియునన్న భయముచే అతి జాగ్రత్తగా మసలినది. భర్తపై అనురాగము చూపించ ప్రారంభించినది. తన లీలావిలాసములలో నాతని ముంచెత్తునది. తనభర్తలో రాజేశ్వరుని యూహించుకొనునది. ఈ కౌగిలింత, ఈ ముద్దాతని కిచ్చిననేకదా జన్మము సార్థకము. ఈ ముసలికోతికి తన యీ విలువగల కౌగిలింత, ముద్దు ధారపోయవలసివచ్చుచున్నది. భగవంతు డింత నిర్దయుడేమి యనుకొన్నది.

ఛీ! ఛీ! మనము చేయు నీ పాపకార్యమునకు భగవంతుని తలచుటేల యనుకొన్నది. ఇందు పాప మేమున్నది? నిజమైన ప్రేమే వివాహమని భర్త రహస్యముగా తెచ్చుకొన్న నవలలో నున్నదిగా! ఆ నవల ‘స్వతంత్ర ప్రేమ’ సంఘాధ్యక్షునిచే వ్రాయబడినది.


౧౦ ( 10 )

దేశయాత్రా విశేషములు

శారదకు మనస్సేమియో బోధించుచునేయున్నది. మొదటి మూడుదినములు భర్త తన్ను బ్రతిమాలినాడు గాని తరువాత తాను గదిలో నున్నదియు లేనిదియు గమనించకుండ నిదురించినాడు. ‘అమ్మయ్యా వదిలినా’ డని సంతోషించినది. పిమ్మట కాలముగడచి వారములు బ్రవహించిపోయినకొలది శారదకు మనస్సు పరిపరివిధముల బోయినది.

భర్త దేశయాత్రకు బోయినాడు. ఏ దేశముల దిరుగుచున్నాడో యని తన తండ్రి ప్రొద్దస్తమానము దిగులుపడుచుండుటవలన, నామెకు భర్తపై కోపము కలిగినది. కాని ఆటలలో, సంగీతములో, చదువులో భర్తమాటే మరచిపోవుచుండును.

ఇంతలో నక్టోబరు నెలాఖరున భర్త కొత్తపేట వచ్చినాడనియు, గాశీ సంతర్పణ తల పెట్టినారనియు నుత్తరములు వచ్చినవి.

చెన్నపట్టణమునుండి యప్పుడే వచ్చిన జమీందారుగారు భార్యను జూచి ‘అల్లుడు రాజమందిరము వచ్చినప్పుడు మన యింటికి వచ్చినాడా?’ యని ప్రశ్నించెను.