పుట:Narayana Rao Novel.djvu/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

196

నా రా య ణ రా వు

యుండెను. శారదచుట్టు చేయివేసినప్పు డాతని కన్ను లెఱ్ఱపడినవి. కాయము మోహావేశముచే వణకిపోయినది. ఆ వణకంతయు నెమ్మదించుకొనుచు శారద యందమును గూర్చి తలపోయుచు నా జమీందారు డటులనే యాలోచనాపరుడైపోయినాడు. వెనుక విజయనగరములో మనోహరియను వేశ్యతో దాను సలిపిన క్రీడలన్నియు నాతని స్మృతిపథంబునకు వచ్చినవి. ఆ పిల్ల కన్నెరికమునకు లక్షాధికారు లనేకులు ధనమిచ్చెదమన్నను, వారందరు సమర్పణ చేసెదమన్న రొఖ్కముకన్న మిన్నగా తానర్పింప నీయకొనెను. దానే కన్నెరికముచేసి, యా రాత్రి దాననుభవించిన మహదానందము స్మరించుకొనుచు, శారద తన కౌగిలి జేరినచో నంతకన్న నెక్కువ సంతోషము బొందువాడనుగదా యని, తలంచికొని యుస్సురుమనియెను.

జమీందారుగారు తన కొమార్తె శారద జగన్మోహనునితో నెక్కువ చనువు చేయరాదని యూహించుకొని శారదను జూచి ‘అమ్మా నువ్వు జగన్మోహనరావుతో నంత చనువుగా నుండకూడదు. నువ్వీమధ్య చదువుతగ్గించి నట్లున్నది. ఈ యేడు తప్పక స్కూలు ఫైనలు పరీక్షలో నెగ్గాలిసుమా. మీ గురువుగారితో ఇంకా జాగ్రత్తగా చెప్పమని చెప్తాను. సరే, లోపలికి వెళ్ళు’ అని చెప్పినారు.

శారద తెల్లపోయి నెమ్మదించుకొని ‘బాగానే చదువుకుంటున్నానండి నాన్నగారూ! తప్పకుండా పరీక్షలలో నెగ్గుతానని ధైర్యంగా వుంది’ అని జవాబు చెప్పినది. ఆమె కన్నులలో నేలనో నీరుతిరిగినది.

జగన్మోహనరావు బావ తన్ను ప్రేమించుచున్నాడని తండ్రి గ్రహించి నాడేమో యని యామె కొంచెము భయపడినది. ఆమె మాటలో చూపులో నిర్మలత్వము ప్రద్యోతమగుచున్నది. ఆమె హృదయము నిష్కలుషము. ఒక నిమేషము తనయను దీక్ష్ణముగా జూచి యామెకు దెలియకుండగనే కనులు వాల్చి కొమరితను దగ్గరకు దీసికొని, యామె శిరంబు మూర్కొని ముద్దిడుకొనెను. శారద లోనికి వెడలిపోయినది.

జగన్మోహను డంతకంతకు నథోగతిలో పడిపోవుచున్నాడనియు, విజయనగరములో కొందరు వారకాంతలతో దిగంబరుడయి యొక గణికా గృహంబున జలక్రీడలు సలిపినాడనియు, జమీందారీవలనవచ్చిన రాబడిచాలక దినదినము వేలకువేలప్పుచేయుచున్నాడనియు, యూరేషియను సాంగత్యమున వారికి ధనము దోచిపుచ్చుచున్నాడనియు జమీందారు గారికి అస్పష్టమైన వార్తలు వినవచ్చినవి.

రెండవ బావగారగు నారాయణరావు తనకు కథ చెప్పచున్నట్లు కల గనుచు కుమారరాజా కేశవచంద్రరావు నిదురగూరినాడు.

నారాయణుడు రాత్రి రైలులో వెళ్లుచున్నాడు.