పుట:Narayana Rao Novel.djvu/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

నా రా య ణ రా వు

యానందించుచుందురు. నోరూర జక్కగా వేదాంతోపన్యాసాలు చేయగలదామె.

‘జన్మం రజ్జు సర్పభ్రాంతి వంటిది. దారు పురుష భ్రాంతి, ఎండమావులు నీరను భ్రాంతి. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే అరిషడ్వర్గాలు చంపుకోవాలి. లేకపోతే ఎరుకలోబడి తనబిడ్డ, తనమగడు, తనయిల్లు తన నగలు, తన సంసారము అని జీవుడు భ్రమించి పుట్టుటా గిట్టుటా అనే మాయలోబడి, మూత్ర పురీషాదుల్లో దొర్లి, అచలతత్త్వం గ్రహించలేక, ముక్తి పొందలేక ఉంటుంది. శుద్ధనిర్గుణమైన అచలతత్త్వం గ్రహించాలి. పంచాక్షరి జపిస్తూ ఉండాలి’ అని లక్ష్మీనరసమ్మగారు శిష్యురాండ్రకు బోధించుచుండును.

ఆమెకు బంచీకరణము కంఠస్థము. పండ్రెండు రాజులకథలు, ఇంద్రజాలపుగథలు క్షుణ్ణముగా వచ్చును. సీతారామాంజనేయము మంచినీళ్ళ ప్రాయము, శుద్ధనిర్గుణతత్త్వ కందార్థదరువులు ఎల్లప్పుడు పాడుకొనుచునే యుండును.

శారద కివియన్నియు పల్లెటూరి గొడవలని తోచినది. తనతల్లి కెప్పుడిట్టి ఛాందసములు లేవు. పట్టణవాసస్థులువచ్చి పల్లెటూళ్లలో నెట్లు జీవింపగలరో యని యామె తలపోసినది. అత్తవారింటి కథలన్నియు దల్లితో మేనత్తతో దనయింట నున్న యితర స్త్రీలతో జెప్పి నవ్వించినది.

అత్తగారు వెడలిపోయిన నాలుగురోజులలో శారద యుక్తవయస్కురాలైనది. జమీందారుగారింట మూడురోజు లుత్సవములు విందులు జరిగినవి. దినదినము పేరంటాండ్రు విచ్చేసినారు. పంచదారతో జిమ్మిలిగొట్టి పంచినారు. బ్యాండుమేళము వచ్చినది. పంక్తినాడు సూర్యకాంతము, మాణిక్యాంబ జమీందారు గారింటికి వచ్చి పంక్తిజరిపి వెలగల బహుమతులు, చీనిచీనాంబరముల నిచ్చి వెడలిపోయిరి. నగరమునందున్న వారి నెందరినో స్త్రీ, పురుషులను భోజనములకు బిలిచినారు.

నవనాగరికుడై వీరేశలింగాఖ్యుని ప్రియశిష్యుడైన జమీందారుగారు నేడు పల్లెటూరివారితో వియ్యమంది ఛాందసపు పూర్వాచార పిశాచగ్రస్తులైనారని పలువురు విచారించిరి.

యజ్ఞోపవీతముగూడ దీసివేసి అనుష్టానిక బ్రాహ్మసామాజికుడైన శ్రీనివాసరావుగారు మిత్రుని జూచి ‘ఆడపిల్లకీడురావడమనేది శరీరంలో జరిగే ఒక మార్పుకు చిహ్నం. దానిని లోకానికి టాంటాంజేయడ మంత మొరకుదనం ఇంకోటుందా’ యని ప్రశ్నించిరి.

‘అది నాకు ఇష్టంలేదు కాని, అది మొరకుతనమని మనం గ్రహించింది పాశ్చాత్యుల సంపర్కం చేతనేనా! మనవాళ్ళ పూర్వాచారాలు అనేకం ఈ నాటికి మూఢత్వము అని అనుకుంటున్నాము. ఇదివరదాకా మోటుతనము