పుట:NagaraSarwaswam.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13


"బాహ్యే చందన పంకాక్త మత్యర్ధ మనురాగతః"

తాంబూలమునకు మంచిగంధ మంటించినప్పుడు నాకు నీయందు మిక్కిలి యనురాగము కలదని సూచించుటకు సంకేతముగా శాస్త్రముస చెప్పబడ్డది.

పర్యంకాకారముగల తాంబూలమునంపి రాకుమారి తన మనస్సులోని సంగమాశను తెలుపగా దానిపై మంచిగంధముసలది అజయుడు నాకు నీయందు మిక్కిలి యనురాగముకలదని సూచించెను.

మరికొంత సమయానికి పరిచారిక పళ్ళెరము లేకయే చేతనొక చీటిగొని యాతని సన్నిధికివచ్చి యా చీటినందించింది. దానియందిట్లు వ్రాయబడిఉన్నది.

ఆర్యా! తాము ఎడమచేతి బొటనవ్రేలి చివరిరేఖనాడు తిరుగ యిచ్చటకు దయచేయుడు.

-రాకుమారి రత్నపదిక,

అనియున్నది.

"శుక్లేవామకరో జ్ఞేయః అసితే దక్షిణః కరః”.

అని శాస్త్రము. అనగా ఎడమచేయి శుక్లపక్షమునకు కుడిచేయి కృష్ణపక్షమునకు సంకేతములు. చేతికి వ్రేళ్ళైదు, ప్రతివ్రేలికి రేఖలు మూడు. మొత్తమీ రేఖలు పదునైదు. అందు చిటికెనవ్రేలి మొదటి రేఖ పాడ్యమి తిధిని, రెండవది విదియను, మూడవది తదియను సూచించును. ఇట్లు వరుసగా పదునైదు రేఖలు పదునైదు తిధులకు గుర్తులుగా శాస్త్రము సూచించెను.

ఎడమచేతి బొటనవ్రేలి చివరిరేఖ నాడనగా పూర్ణిమ అయినది రాకుమారి పూర్ణిమనాడు రమ్మని సంకేతము చెప్పినదని గ్రహించి-అజయుడు, నేడు శుద్ధవిదియకచా! అని కొంచెమాలోచించి ఆకాగితము మీదనే-