పుట:Naa Kalam - Naa Galam.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేఖ రాయగా, ఆయన వెంటనే అంగీకరించి, జి.వో. విడుదల చేశారు. అంతే కాదు - ఆ ఏడాది ఆగస్టు 23వ తేదీన "ఆంధ్రకేసరి" ప్రకాశం గారితో సన్నిహితంగా పని చేసి, అప్పటికి సజీవులై వున్న ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం సన్మానిస్తూ, నన్ను కూడా సన్మానించింది. అది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యాన మొదటి గ్రామ స్వరాజ్య దినోత్సవం! ఆ తరువాత గ్రామ స్వరాజ్య దినోత్సవాలను ఎక్కడ జరిపినట్టు కనిపించదు. ఆంధ్రులు ఆరంభ శూరులు కదా! ఒక్క ఉత్తరం రాస్తే, ఆనాటి ముఖ్యమంత్రి నా సూచనను గౌరవించి, దానిలోని ప్రాధాన్యాన్ని గుర్తించి, వెంటనే జి.ఓ. జారీ చేయించారు. పరిపాలకులు అలా వుండాలి!

బిల్‌ క్లింటన్‌ ప్రతిస్పందన

కొన్ని ముఖ్య విషయాలపై వెంటనే ప్రతిస్పందించి, చర్య తీసుకొనడంలో మన పరిపాలకులు చాలా వెనుకబడి వున్నారని చెప్పక తప్పదు. అప్పటిలో ప్రధాని నెహ్రూ, ఇందిరాగాంధి, రాజీవ్‌ గాంధి, మొరార్జీ దేశాయ్ , చరణ్‌సింగ్‌, డాక్టర్ చెన్నారెడ్డి ప్రభృతులు ఒక్క ఉత్తరం రాస్తే చాలు, వెంటనే స్పందించి, చర్య తీసుకునేవారు. ఇప్పుడు ఆ "లేఖా సంస్కృతి" క్రమేణా సన్నగిల్లుతున్నది. నేను రాసిన లేఖలకు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, బ్రిటిష్‌ ప్రధాని టోని బ్లెయిర్‌, ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ చార్లెస్‌, మన రాష్ట్రపతులు, శ్రీలంక అధ్యక్షుడు రాజ పక్ష మొదలైన వారందరు వెంటనే ప్రతిస్పందించేవారు. గుజరాత్‌లో భూకంపం వచ్చినప్పుడు విపరీతమైన జన నష్టం సంభవించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ గుజరాత్‌ వచ్చి, భూకంప బాధితులను పరామర్శించి, వారికి వస్తు సహాయం చేశారు.

నేను ఆయనకు గుజరాత్‌ భూకంప బాధితుల తరఫున ధన్యవాదాలు చెబుతూ, వారికి ఇంకా సహాయం చేయాలని అభ్యర్ధిస్తూ లేఖ రాయగా,