పుట:Naa Kalam - Naa Galam.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధాని నెహ్రూ సందేశం

ఇక, మా అబ్బాయికి "జవహర్‌లాల్‌ నెహ్రూ" అన్న పేరు పెట్టడం వెనక ఆసక్తికరమైన కథనమే వుంది. మా వివాహానికి భారత ప్రథమ ప్రధాని పండిట్‌ నెహ్రూ ఒక సందేశం పంపిస్తూ "ఒక నాటికి భారత ప్రధాని కాగలిగిన పుత్రుడు త్వరలో మీకు కలుగు గాక!" అనే అర్థం వచ్చే శుభ సందేశ లేఖ రాశారు! అది ఆయన చమత్కృతి! ఆ లేఖ, వివాహమైన నాలుగైదు రోజులకు కాని మాకు చేరలేదు. అప్పుడు మేమిద్దరం అనుకున్నాము - మనకు కుమారుడు కలిగితే, "జవహర్‌లాల్‌ నెహ్రూ" అని పేరు పెడదామని. అయితే, మొదటిసారి అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి మా జీవితానికి అర్ధవంతమైన "ప్రేమజ్యోతి" అని పేరు పెట్టాము. తరువాత కుమారుడు కలగగానే జవహర్‌లాల్‌ నెహ్రూ అని పేరు పెట్టాము.

రాజీవ్‌గాంధి సందేహం

అయితే, మా అబ్బాయికి జవహర్‌లాల్‌ నెహ్రూ అని పేరు పెట్టడం రాజీవ్‌గాంధీకే ఆశ్చర్యం కలిగించింది! 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారానికి శ్రీ రాజీవ్‌గాంధి విజయవాడ వచ్చారు. ఆ రోజు రాత్రి మరుపిళ్ల చిట్టి కాంగ్రెస్‌ ఆఫీసు సమీపంలో జరిగిన సభలో రాజీవ్‌గాంధి ఉపన్యాసాన్ని నేను తెలుగులోకి తర్జుమా చేశాను. ఆ మరునాడు విజయవాడ కెనాల్‌ గెస్ట్‌హౌస్‌లో తనతో బ్రేక్‌ఫాస్ట్‌కు రాజీవ్‌ నన్ను ఆహ్వానించారు. నాతోపాటు జవహర్‌లాల్‌ను కూడా తీసుకువెళ్లాను. రాజీవ్‌కు అతనిని పరిచయం చేశాను. "పూర్తి పేరు పెట్టారా?" అని ఆయన ఆశ్చర్యంగా నన్ను ప్రశ్నించారు. "నెహ్రూ" అంటే వారి ఇంటి పేరు. ఉత్తర భారతదేశంలో చాలా మందికి ఇంటి పేర్లు- నెహ్రూ, పటేల్‌, గాంధి - పేరు చివరవుంటాయి. అలాంటప్పుడు, మీ ఇంటి పేరు వుండగా, "నెహ్రూ" అనే ఇంటి పేరును కూడా మీ జవహర్‌లాల్‌