పుట:Naa Kalam - Naa Galam.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుకున్నాం. చివరికి "ప్రజాసేవ" అన్న పేరు బాగుందనుకున్నాం. నా పేరుతోనే ఆ తెలుగు వారపత్రికకు డిక్లరేషన్‌ తీసుకున్నాము. పత్రికకు ఆయన చీఫ్‌ ఎడిటర్‌ అయితే, నేను ఎడిటర్‌ను. 1955 డిసెంబర్‌ 16న ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి ఆత్మబలిదానం చేసిన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి నాడు "ప్రజాసేవ"కు ప్రారంభోత్సవం. ప్రారంభకులు ప్రముఖ గాంధేయవాది మాత్రమే కాక, మహాత్మాగాంధికి అత్యంత సన్నిహితుడు ఆచార్య జె.సి. కుమరప్ప. సభాధ్యక్షులు, ప్రముఖ సోషలిస్టు నాయకుడు, ఆ తరువాత "లోక్‌ నాయక్‌"గా జగత్ప్రసిద్ధుడైన శ్రీ జయప్రకాష్‌ నారాయణ్‌. డాక్టర్ గారు ప్రకాశంగారి అనుంగు శిష్యుడే కాక, గాంధేయవాది. అందువల్ల, ఆ మహా మహులిద్దరిని ఆహ్వానించారు.

పత్రిక వ్యవస్థాపకులు డాక్టర్ చలపతిరావు గారు రాజకీయంగా అతివాది. అందువల్ల, పత్రికలో ఆనాటి రాజకీయాలను తీవ్రంగా విమర్శించే వ్యాసాలు, రాజకీయ విశ్లేషణా వ్యాసాలు ఎక్కువగా వుండేవి. సినిమా పేజీ ఒక ప్రత్యేక ఆకర్షణ. ప్రఖ్యాత పార్లమెంటేరియన్‌ శ్రీ తెన్నేటి విశ్వనాథం ఆ పత్రికలో "శాసన" అన్న మారు పేరుతో కొంతకాలం వారం వారం జాతీయ, అంతర్జాతీయ విశేషాలపై, తన వ్యాఖ్యలతో వ్యాసాలు రాసేవారు. దాదాపు అయిదు సంవత్సరాలు దిగ్విజయంగా, నిరాటంకంగా నడిచిన ఆ పత్రికకు రాష్ట్ర వ్యాప్తంగా మంచిపేరు, ప్రాచుర్యం లభించాయి.

కలకత్తాలో కనిపించిన "పెళ్లి కూతురు"

'ప్రజాసేవ'లో వున్నప్పుడే కలకత్తా ఆంధ్రా అసోసియేషన్‌ వారు నాకు సన్మానం తలపెట్టారు. అది 1959 జనవరి 26 రిపబ్లిక్‌ దినోత్సవ సందర్భం. నాతోపాటు గన్నవరం ప్రక్కనే వున్న బుద్ధవరం కరణంగారి అమ్మాయి, "నాట్యరాణి" కృష్ణ కుమారికి కూడా సన్మానం. ఆమెకు అప్పటికి దాదాపు