పుట:Naa Kalam - Naa Galam.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18 సంవత్సరాల వయస్సు. అప్పటికే ఢిల్లీ, మద్రాసు, హైదరాబాద్‌ మొదలైన నగరాలలోను, చాలా పట్టణాలలోను దాదాపు వెయ్యి వరకు కూచిపూడి నృత్య ప్రదర్శన లిచ్చింది. 1954లో ఢిల్లీలోని సప్రూ హౌస్‌లో ఆమె నృత్య ప్రదర్శనను ప్రధాని నెహ్రూ, ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ప్రభృతులు తిలకించి, ప్రశంసించారు. ప్రధాని నెహ్రూ ఆ మరునాడు ఉదయం కృష్ణకుమారిని, ఆమెతో వున్న నాట్య బృందాన్ని తన నివాసంలో అల్పాహారం విందుకు ఆహ్వానించారు.

ఆమె చాలా చలాకీ అమ్మాయి. నాట్య కళాకారిణి కావడం వల్ల సహజంగానే బెరుకూ బెదురూ లేకుండ మాట్లాడేది. కలకత్తా సన్మానానికి విజయవాడ నుంచి రైలులో కృష్ణకుమారి, ఆమె తాతగారు, తండ్రిగారు, నాట్య బృందం అందరం కలిసే వెళ్లాము. అప్పటిలో విజయవాడ నుంచి కలకత్తా రైలు ప్రయాణమంటే సుదీర్ఘంగానే వుండేది. ఒక పగలు, రెండు రాత్రుళ్లు! మార్గం మధ్యలో రైలులో ఆమెను ఒక పాట పాడవలసిందిగా - ఉబుసు పోకకు - నాట్య బృందంలోని వారు కోరారు. ఆమె "మిస్సమ్మ" లోని "ఏమిటో ఈ మాయా! ఓ వెన్నెల రాజా!" అనే పాట పాడింది. ఆమె నాట్యకత్తె కాని పాట కత్తె కాదు. అయినా, శ్రావ్యంగానే వుంది. ఆ పాటలో "చెలిమి కోరుచూ ఏవో పిలుపులు నాలో నాకే వినిపించెనయా!" అన్న చరణం పాడేటప్పుడు ఆమె నావంక భావగర్భితంగా చూసింది! ఆ సంకేతం నాకేమీ అర్ధం కాలేదు!

ఆ తరువాత "నీ వుండేదా కొండపై, నా స్వామి నేనుండే దీనేలపై, ఏ లీలా సేవింతునో, దూరానానైనా కనే భాగ్యమీవా! నీ రూపు నాలో సదా నిల్పనీవా! ఏడుకొండలపైన వెలసిన దేవా! నా పైన దయచూపవా!" అన్న పాదాలు పాడేటప్పుడు నావంక రెండు, మూడుసార్లు ఓర చూపులు చూసింది! అప్పటికీ నాకేమీ అర్థ కాలేదు! అయితే, వాళ్ల నాన్న గారు తమ అమ్మాయి