పుట:Naa Kalam - Naa Galam.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హాజరైన ఆ సభలో నేను లిఖిత పూర్వకమైన, ఆవేశపూరితమైన ఉపన్యాసాన్ని చదివాను. నా ఉపన్యాసం ఆ సభా సదులతోపాటు డాక్టర్ గారికి బాగా నచ్చింది. ఆ సభకు అధ్యక్షుడు పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ పి.సి. ఘోష్‌ కాగా, కేంద్ర మంత్రి, ప్రధాని నెహ్రూకు అనుంగు మిత్రుడు రఫీ అహమ్మద్‌ కిద్వాయ్ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రదేశంలోని రాజకీయ అతిరథ, మహారథులెందరో ఆ సభలో పాల్గొన్నారు.

"నీలం సంజీవరెడ్డికి బహిరంగ లేఖ"

రెండవది - 1954లో అమెరికా సందర్శనకు మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్ చలపతిరావు గారికి ఆహ్వానం రాగా, అప్పటి ఆంధ్రరాష్ట్ర ఉపముఖ్యమంత్రి - హోమ్‌మంత్రి అయిన శ్రీ నీలం సంజీవరెడ్డి డాక్టర్ గారికి పాస్‌పోర్టు రాకుండ అవరోధించారని మా అందరికీ అసంతృప్తి. అప్పటిలో చలపతిరావు గారికి వీడ్కోలు సభ జరగగా, దానిలో నేను కూడా ఉపన్యాసకుణ్ణి. అయితే, తీరా డాక్టర్ గారు అమెరికా బయలుదేరే సమయానికి ఆయన పాస్‌పోర్టును తొక్కిపట్టారు. ఇంకేమి వెడతారు?

ఈ సంఘటన నాకు బాగా బాధ కలిగించింది. నేను అప్పుడు వ్యాసాలు రాస్తున్న "తెలుగు స్వతంత్ర"లో "శ్రీ నీలం సంజీవరెడ్డికి బహిరంగ లేఖ" అన్న శీర్షికతో శ్రీ సంజీవరెడ్డి చర్యను తీవ్రంగా విమర్శిస్తూ ఒక బహిరంగలేఖ రాశాను. ఆ వ్యాసం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. శ్రీ సంజీవరెడ్డికి అసంతృప్తి, డాక్టర్ గారికి సంతోషం కలిగించింది. డాక్టర్ గారికి నాపట్ల అభిమానం కలగడానికి అది ముఖ్య కారణం.

ఇక, పత్రిక సంగతి. దానికి ఏ పేరు పెట్టాలని డాక్టర్‌గారు, నేను ఆలోచించాం. "ప్రజాజ్యోతి" అన్న పేరును గురించి ఆలోచించాం. అది సామాన్య పాఠకులకు నోరు తిరగడానికి కొంచెం ఇబ్బందిగా వుంటుందేమో