పుట:Naa Kalam - Naa Galam.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరిగి యథాప్రకారంగా ఫ్రీ లాన్స్ జర్నలిస్టుని. "తెలుగు స్వతంత్ర"కు, "ఆంధ్రప్రభ"కు, "ఆంధ్రపత్రిక"కు వ్యాసాలు రాయసాగాను.

"ప్రజాపత్రిక" నుంచి "ప్రజాసేవ"లోకి

1955 చివరిలో నేను విజయవాడ సత్యనారాయణపురంలో వున్న మా చెల్లెలు సౌందర్యవతి ఇంటి నుంచి పున్నమ్మతోటలో వున్న మా అన్నగారు సుందర రామారావు గారింటికి వస్తున్నాను. అది రెండు, మూడు కిలోమీటర్ల దూరం వుండవచ్చు. అప్పటిలో నడకే. సైకిలు రిక్షాపై రావచ్చు. కాని, దానికి రెండణాలో, మూడణాలో ఇచ్చుకోవాలి కదా! అంత ఎక్కడ వుంది? నేను గాంధినగరంలోని ఎస్‌.కె.పి.వి.వి. హిందూ హైస్కూలు ముందు నుంచి నడుస్తుండగా, అకస్మాత్తుగా వెనుక నుంచి వస్తున్న ఒక కారు నా ప్రక్కనే ఆగింది. దానిలో నుంచి "కుటుంబరావు గారూ!" అన్న పరిచితమైన గొంతు నుంచి వచ్చిన పిలుపు వినిపించింది. కారులోకి చూస్తే, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్ టి.వి.ఎస్‌. చలపతిరావు గారు! "కారెక్కండి" అన్నారాయన. "ఈ పూట నాతో కలిసి మా ఇంటిలో భోజనం చేద్దురు గాని" అని అన్నారు. ఇద్దరం భోజనం చేస్తుండగా, తాను ఒక తెలుగు వారపత్రిక పెడుతున్నట్టు, దానికి నన్ను ఎడిటర్‌గా వుండమని కోరారు. నేను అప్పటికి ఖాళీగానే వున్నాను కాబట్టి, వెంటనే సంతోషంగా అంగీకరించాను.

చలపతిరావు గారు అంతకు పూర్వం నేను ప్రకాశంగారి "ప్రజాపత్రిక"లోకి వెళ్లడంలో నిర్వహించిన పాత్రను ఇంతకు పూర్వమే పేర్కొన్నాను. ఆయనకు నా పట్ల సద్భావం, సానుభూతి వుండానికి కారణాలున్నాయి.

1951 జూలైలో విజయవాడలో "ఆంధ్రకేసరి" ప్రకాశం గారి కంచు విగ్రహ ప్రతిష్ఠాపనలో ఆయనది ప్రముఖ పాత్ర. దాదాపు రెండు లక్షల మంది