పుట:Naa Kalam - Naa Galam.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జేబులో నుంచి అయిదు రూపాయలు తీసి యిచ్చాను. నా వద్ద వున్నది కూడ ఏడున్నర రూపాయలే!

ఉద్యోగం కాదు, తపస్సు

"ప్రజా పత్రిక"ను మూసివేయగానే తిరిగి అప్పటి నా స్వస్థలం గన్నవరం వచ్చి వేద్దామన్న సన్నాహాలలో వున్నాను. ఈ మధ్యలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అప్పటి "ఆంధ్రపత్రిక" సంపాదకులు శ్రీ శివ లెంక శంభుప్రసాద్‌ నన్ను తమ పత్రికలో పనిచేయవలసిందిగా సూచించారు. నిజమే! అది సదవకాశమే. సాక్షాత్తు "దేశోద్ధారక" కాశీనాథుని నాగేశ్వరరావు గారు బొంబాయిలో 1908లో స్థాపించిన పత్రిక అది. వారపత్రికగా ప్రారంభమైన ఆ పత్రికను 1914లో దిన పత్రికగా మార్చి, మద్రాసు తీసుకువచ్చారు. దానిలో పని చేయడం గొప్ప అవకాశమే!

కాని, ఆ పత్రిక అంతకు క్రితం వరకు నేను కార్యదర్శిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం గారికి ప్రతికూలం! ప్రకాశం గారి అప్పటి రాజకీయ ప్రత్యర్థి కళా వెంకటరావు గారికి అనుకూలం.

"అయ్య వార్లూ! (అప్పటిలో శంభు ప్రసాద్‌ గారిని గౌరవంగా అలా సంబోధించేవారు) నేను ఇప్పటి వరకు ప్రకాశం గారి పత్రికలోను, ఆయన కార్యదర్శి గాను పని చేశాను. ఇప్పుడు అవకాశం వచ్చింది కదా అని మన "ఆంధ్రపత్రిక"లో చేరితే, నేను ప్రకాశం గారికి వ్యతిరేకంగా రాయవలసివస్తుంది కదా! అది ఆత్మవంచన అవుతుంది. ప్రకాశం గారికి అనుకూలంగా రాసిన ఈ కలంతో ఆయనకు వ్యతిరేకంగా రాయడం, లేదా ఆయనకు ప్రతికూలంగా పనిచేయడం నా వల్ల కాదు. నాకు జర్నలిజం ఒక ఉద్యోగం కాదు. ఒక తపస్సు. మీ అభిమానం నా జీవితంలో మరచిపోలేను". అని వారికి చెప్పి, నేను తిరిగి గన్నవరం వచ్చివేశాను!