పుట:Naa Kalam - Naa Galam.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

- గుంటూరు ప్రాంతానికి బదులు కర్నూలును ఆంధ్రరాష్ట్ర రాజధాని చేశారన్న బాధతో ఆ పత్రిక యజమాని శ్రీ కర్లపాటి అప్పారావు పత్రికను ఆకస్మికంగా మూసివేశారు! విజయవాడ రాజధాని అయితే అప్పారావు గారికి ప్రయోజనం. ఆ ప్రాంతంలో ఆయనకు చాలా స్థలాలున్నాయి. రాజధాని వస్తే వాటి విలువ విపరీతంగా పెరిగిపోయేది! మరి, ప్రకాశంగారు 1937లో ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం రాయలసీమ నాయకుల కోర్కెపై - రాజధానిని కర్నూలు, హైకోర్టును గుంటూరులో పెట్టవలసివచ్చింది.

ఔషధ సేవకు అయిదు రూపాయలు లేని "ఆంధ్రకేసరి"

అప్పుడే అత్యంత దయనీయమైన, తలచుకుంటే ఇంతకాలమైన తరువాత, ఇప్పుడు కూడా నాకే కాదు, ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లే ఒక సంఘటన జరిగింది. అది 1953 జూన్‌ 2వ తేది రాత్రి 8 గంటల సమయం. నేను ప్రకాశం గారి మద్రాసు మౌంట్‌రోడ్‌ నివాసం ముందు పచార్లు చేస్తున్నాను, ఆయన నుంచి ఎప్పుడు పిలుపువస్తుందోనని!

ఇంతలో ప్రకాశం గారి రెండవ కుమారుడు హనుమంతరావు నా వద్దకు వచ్చి, "కుటుంబరావు గారూ! మీ దగ్గర అయిదు రూపాయలున్నాయా? నాన్నగారికి మందుకొనాలంటే డబ్బు లేదు" అన్నారు. నేను ఒక్కసారి నిర్విణ్ణుణ్ణి అయ్యాను!

ప్రకాశంగారికి నంజు వ్యాధి వుంది. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక ఔన్సు బ్రాంది తీసుకొనకపోతే, తెల్లవారే సరికి కాళ్లు అరటి స్తంభాలవలె లావై పోయేవి! బారిష్టర్‌గా అన్ని లక్షలు సంపాదించి, అప్పటికి ఒకసారి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన ఆ మహాదేశ భక్తునికి, త్యాగధనునికి చివరికి మందు కొనడనికి అయిదు రూపాయలు లేవంటే ఏమనుకోవాలి? ఎంతటి హృదయ విదారకమైన సన్నివేశం! నేను వెంటనే