పుట:Naa Kalam - Naa Galam.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎడిటింగ్‌లో ఏదైనా తప్పు పడిందా? ఎవరైనా ఫిర్యాదు చేశారా? అన్న ఆందోళనతో కూడిన ఆలోచనతో ఆయన గదిలోకి వెళ్లాను.

"కుటుంబరావ్‌! నా కార్యదర్శి కొండపి నైట్‌ కాలేజీలో "లా" చదువుతున్నాడు. అందువల్ల, ఒక సంవత్సరం పాటు అతనికి సెలవు కావలసి వచ్చింది. అందువల్ల నువ్వు సాయంత్రం నాలుగు గంటల వరకు పత్రిక పని చూసి, ఆ తరువాత రాత్రి 9,10 గంటల వరకు కొండపి చేసే పని నువ్వు చూడు" అని అన్నారు!

నాకు ఆందోళన కలిగింది! "ఆంధ్రకేసరి"కి దూరంగా వుండి, నా పని నేను చేసుకుంటూ, అప్పుడప్పుడు అయిదు నిమిషాలో, పది నిమిషాలో ఆయనను కలుసుకుని మాట్లాడ్డం వేరు. కాని, రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9,10 గంటల వరకు ఆ మహానాయకుని సమక్షంలో ఆయనకు సహాయకుడుగా పనిచేయడం మాటలా?

"ఆంధ్రకేసరి"లో ఒక విశేషం వుంది. ఆయన మందలించినా, మండిపడినా పెద్ద వారిపైనే! యువకులను ఆప్యాయంగా, వాత్సల్యంతో "ఏమోయ్! ఏమయ్యా!" అని సంబోధించేవారు. ఇక, ఆయనకు చిర పరిచితులైన పెద్దవారిని "ఏరా" అని సంబోధించేవారు! అట్టి వారిలో ఎవరినైనా, ఎప్పుడైనా "ఏమండీ!" అని కాని, పేరు తరువాత "గారు" అని కాని పిలిస్తే, ఆ పెద్ద మనిషికి ఆ రోజు ఏదో మూడిందన్న మాటే! ఆయనతో చివాట్లకు దోసిలి పట్టవలసిందే!

మద్రాసులో ఆ పది నెలలలో నా జోడు ఉద్యోగాల జీవితం సాఫీగా, సజావుగా నడిచిపోయింది. అప్పటికి నా వయస్సు 21,22 సంవత్సరాలే!

ఇంతలో "ప్రజాపత్రిక" ఆగిపోయింది! ప్రకాశం గారు విజయవాడ