పుట:Naa Kalam - Naa Galam.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రరాష్ట్ర నిర్మాణం తరువాత 1964లో భువనేశ్వర్‌ కాంగ్రెసు మహాసభకు అధ్యక్షత వహించడానికి విజయవాడ మీదుగా వెడుతున్న శ్రీ కామరాజ్‌ స్పెషల్‌ ట్రెయిన్‌ విజయవాడలో ఆగినప్పుడు ఒక ప్రముఖుడు నన్ను ఆయనకు పరిచయం చేశారు. నేను "తిరు" ఉదాహరణలను, నా లేఖను ఆయనకు జ్ఞాపకం చేశాను.

శ్రీ కామరాజ్‌ జ్ఞాపక శక్తి గొప్పది. అయిదవ తరగతి వరకే చదివినా, ఆయన మద్రాసు ముఖ్యమంత్రి పదవిని అలంకరించి, పండిట్‌ నెహ్రూ హయాంలోనే ఆయన కోర్కెపై అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడై, రెండు సార్లు కేంద్రంలో ప్రధాన మంత్రి పదవి ఖాళీ అయినప్పడు రెండు సార్లూ ప్రధానులను నిర్ణయించి, "కింగ్‌ మేకర్‌"గా పేరుపొందాడు.

నేను "తిరు"పట్టణాల వుదంతాన్ని పేర్కొనగానే ఎప్పుడూ గంభీరంగా ఉండే ఆయన ముఖంలో చిరునవ్వు తొంగి చూచింది. "ఔను! జ్ఞాపకముంది!" అంటూ ఆయన నా భుజం తట్టారు. కన్నడిగుల అన్యాయాల మధ్య జరిగిన రెఫరెండాన్ని బళ్లారి తెలుగువారు బహిష్కరించగా, ఆ పట్టణం కర్నాటకలో కలిసిపోయింది. కాగా, కేంద్ర న్యాయశాఖా మంత్రిగా పనిచేసిన శ్రీ హెచ్‌.వి. పటాస్కర్‌ అవార్డు ప్రకారం తిరుత్తణిని తమిళనాడులో కలిపారు. ఆ ఏడుకొండలవాడి దయవల్ల తిరుపతి మాత్రం తెలుగువారికి దక్కింది!

రాధాకృష్ణన్‌ ఔదార్యం

"మీ జన్మ స్థలమైన తిరుత్తణిని తమిళులు కలిపివేసుకుంటే, మీరెందుకు వూరుకున్నా"రని అప్పటి భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ప్రశ్నించగా, "తిరుత్తణి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా, తమిళనాడులో ఉన్నా భారతదేశంలోనే ఉంది కదా!" అని ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చారు!