పుట:Naa Kalam - Naa Galam.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందు, అంతకు పూర్వం సమష్టి మద్రాసు రాష్ట్రంలో తక్కిన ఆంధ్ర జిల్లాలతో పాటు ఉన్న బళ్లారి జిల్లా, బళ్లారి భవితవ్యాన్ని గురించి, ముఖ్యంగా ఆ నగరం ఏరాష్ట్రంలో ఉండాలన్న విషయంలో రెఫరెండం తీసుకోవాలని నిర్ణయించారు.

బళ్లారి పట్టణంలో తెలుగు మాట్లాడే వారే అధిక సంఖ్యాకులనడం నిర్వివాదం. అప్పటిలో బళ్లారి మునిసిపల్‌ చైర్మన్‌ ఆంధ్రుడైన శ్రీ ముండ్లూరి గంగప్ప ! ఆ రెఫరెండంలో బళ్లారిని ఆంధ్ర రాష్ట్రంలో కలపాలన్న ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న శ్రీ గంగప్పకు తోడ్పాటుగా నేను అప్పుడు ఉంటున్న గన్నవరంలో కొంత మొత్తాన్ని విరాళాల ద్వారా వసూలు చేసి పంపాను.

కింగ్‌ మేకర్‌ కామరాజ్‌ :

అలాగే చిత్తూరు జిల్లాలోని తిరుత్తణిని (డాక్టర్ సర్వేపలి రాధాకృష్ణన్‌ స్వస్థలం), తిరుపతిని తమిళనాడులో కలుపుకోవాలని తమిళులు ప్రయత్నిస్తుండగా, ఆ ప్రయత్నానికి నాయకత్వం వహిస్తున్న తమిళ నాయకుడు శ్రీ కామరాజ్‌ నాడార్‌ను, ఆయన వాదాన్ని విమర్శిస్తూ తెలుగు పత్రికలలో కొన్ని వ్యాసాలు, "హిందూ", "ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌" పత్రికలలో సంపాదక లేఖలు రాశాను.

తిరుపతి, తిరుత్తణిల పేర్లలో "తిరు" అన్నది తమిళనామమని, తిరుచినా పల్లి, తిరుచెంగోడ్‌, తిరువాయూర్‌ మొదలైన తమిళప్రాంతాలవలెనే తిరుపతి, తిరుత్తణి కూడా తమిళ ప్రాంతాలని కామరాజ్‌గారి కుతర్కం! "అలా అయితే, కృష్ణాజిల్లా మధ్యలో ఉన్న "తిరు"వూరు కూడా మీదే కాబట్టి, దాన్ని పెల్లగించుకుపోతారా?" అని ఒకలేఖలో శ్రీ కామరాజ్‌ను ప్రశ్నించాను ! ఆయన నుంచి ఏమి సమాధానం వస్తుంది.?