పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

41


శుద్ధవచనకావ్యము లుప్పతిల్లమియకాక చంపూప్రబంధములందలి గద్యములస్థితియు నీవిధమున నుండుకాలమున దక్షిణదేశమునం దాంధ్రవచనకావ్యరచన మారంభింపఁబడినది. అప్ప డక్కడ రచింపఁ బడిన గద్యకావ్యములందుఁ గేవలకల్పితములు లేవు. అన్నియును బురాణములును దదుపాఖ్యానములునుగనే కన్పట్టుచున్నవి. నన్నయాదులచే రచింపఁబడిన భారతాదిప్రబంధములు ప్రౌఢతమము లగుకతనఁ దదర్ధగ్రహణము సామాన్యజనసులభము గాకపోవుటయే యక్కడ తొలుత నీ వచనకావ్యరచనోపక్రమమునకుఁ గారణమయినట్టు చూపట్టుచున్నది. తఱచుగా నీ కావ్యములందు వాక్యములు క్లిష్టాన్వయములై యంతును బొంతును లేక యుండును. వీనియందు గిరిసరిదాదివర్ణన మంతగాఁ గన్పట్టదు. సంస్కృతమూలమునఁ గలప్రధానకథ ననుసరించి పరిమితములగు వర్ణనలతో నీవచనరచన కావింపఁబడినది. ప్రౌఢదీర్ఘసమాసములును, ననుప్రాసప్రయాసములును వీనియందుం గానరావు.

సంహితైకపదే నిత్యా, నిత్యా ధాతూపసర్గయోః
నిత్యా సమాసే, వాక్యేతు సా వివక్షా మపేక్షతే.

సంస్కృతభాషయం దీకారిక వాక్యమునసయితము సంహిత వివక్షాయత్త మని తెలుపుచున్నది. కాని యీపద్ధతి తెలుఁగు భాషయందుఁ దొల్లింటికవు లవలంబించినవారు కారు. గద్యమున నేకవాక్యమందు సంహితను దప్పకపాటించుటయేకాక, రెండువాక్యములు కలయునప్పుడు సయితము విడువరైరి. ఈ కారణముచేఁ బ్రాచీనాంధ్రగ్రంథములం దెక్కడను సంధి విడువఁబడిన గద్యము కాన్పింపదు. ఈ దక్షిణదేశపుటాంధ్ర వచనకావ్యములందుఁ గొన్నింట నట్లుకాక, యుచ్చారణసౌలభ్యముకొఱకై క్వాచితముగాఁ బయికారిక ప్రకారము సంహిత యవివక్షితమై సంధి విడనాడఁబడియున్నది. .