పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

మీఁగడ తఱకలు


దమకుఁ గల్గెడు సౌకర్యమును వీడనాడి యిబ్బడిగా నిర్బంధములను దెచ్చిపెట్టుకొని, తమగ్రంథములందు బహుక్లిష్టముగను, అనుప్రాసనిరంతరముగను, దురవబోధముగను వచనములఁ గూర్చుచు వచ్చిరి. ఇట్టి వచనములను బ్రాయికముగాఁ దద్గ్రంథములఁ బఠించువారు వదలి వేయుచుందురు.

నన్నయభట్టారకాదులు పద్యములం దింపుగాఁ గూర్పవలను పడనివంశక్రమాదివృత్తాంతమును దెలుపవలసినపుడును, మిక్కిలి విరివిగా నున్నకథ నల్లంతతో సంగ్రహింపవలసినపుడును, బఠించువారికి నిరంతరపద్య సంఘటనమువలనc గల్గు విసువు నవయింపవలసినపుడును, నెడనెడ సంస్కృతగ్రంథమును మీఱక హృద్యము లగుగద్యములఁ గల్పించిరి. నాచనసోమనాథుఁ డుత్తరహరివంశమును దెల్గించె నన్నపేరేగాని యందుండి తనయిచ్చకు వచ్చిన మూఁడునాల్గుకథలఁ గైకొని విచ్చలవిడిగాఁ గ్రంథము రచించినవాఁ డగుటచేఁ బద్యములందును గద్యములందును గూడఁ దనగడుసరితనమును విశృంఖలముగఁ జూపుకొనఁ గల్గెను. పోతనామాత్యునకు భాగవతమందలి యాధ్యాత్మికవిషయములు కొన్ని పద్యములందుఁ గూర్పఁ గుదురని వగుటచే గొప్ప గొప్ప గద్యములఁ జెప్పక తప్పదయ్యె. ఆధ్యాత్మికవిషయములఁ దెల్పునపుడే కాక మఱికొన్ని యెడలనుగూడ నీతఁడు పెక్కువగా వర్ణనలఁ బెట్టుకొని, కఠినము లగుగద్యములను గూర్చెను. తర్వాతఁ బెద్దనాదులు తాము విశృంఖలముగాఁ గల్పింప దొరకొన్నమనుచరిత్రాదిప్రబంధములందుఁ జంద్రికాదులను వర్ణింప మొదలిడి యనల్పము లగుకల్పనలఁ గల్పించుకొని, యవి పద్యములం దిమడ్పఁ గుదురకపోఁగా శబ్దాడంబరమం దాదరము మెండుకొనుకతన నంతంతలేసి ప్రౌఢగద్యములఁ గూర్చిరి. అప్పటి నుండియుఁ బ్రబంధ మనుచుఁ గూర్ప మొదలిడిన తర్వాత నట్టిగద్యములఁ గూర్చుట కవులకుఁ దప్పని పనివలె నయ్యెను. మన తెల్గుదేశమున