పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

39


పద్యములట్లు ధారాచమత్కృతి గల్గి చదువ నింపై యుండును. తిక్కనామాత్యుని గద్యములు మిక్కిలి మెలపు మీఱినతెలుఁగుఁ బలుకుబళ్లతో నించుక జిలుగులై బిగువు గల్గి రసమొల్కు చుండును. ఈతని కృతులందు గద్యములు నన్నయార్యుని కృతులందువలెఁగాక, కొండొకమెండై నిడుదలునై పొడకట్టుచున్నవి. ఎఱ్ఱనార్యుని కృతులందలి గద్యము లొక్కొకయెడఁ బ్రౌఢ మగుసంస్కృత రచనమును, గొండొక యెడనినుపారు తెలుఁగుఁగూర్పును గల్గి నిబిడములై ప్రాయికముగా వర్ణనాంశము గల్గియుండును. ఈ మువ్వరగద్యములును ననుప్రాసప్రయాసరహితములై యెల్లవిధముల మేల్మికూర్పు గల్గియున్నవి. కవిత్రయమునకుఁ దర్వాతివారు రచించిన గ్రంథములందు గద్యములు మిక్కిలి మాఱుపాటును జెందినవి. నాచన సోమనాథునిగద్యము చదువువారికి గుండియ తల్లడమును గల్గించుచుఁ గొండవీటిచేఁత్రాళ్లవలె బొడుగువాఱి దేసితెలుఁగుఁబల్కులతో నిండారి యనుప్రాసవిన్యాసములచే నతికఠినములై యుండును. ఈతని గ్రంథమున వచనము లచ్చునఁ బోసి ముద్రకొట్టఁబడినట్లు నెలకొని యున్నవి. యుద్ధాదికమును వర్ణించుపట్టులం దీతఁ డిట్టి వచనములఁ బెట్టుచుండును. కథాంశమును జెప్పునప్పు డీతని కృతియందు గద్యములే యంతగాఁ గాన్పింపవు. శ్రీనాథుఁడు సంస్కృత ప్రాయముగా నుద్ధతశైలితో నతిప్రౌఢమగువచనముల రచించెను. ఒక్కొకయెడ నీతనిగద్యములు నన్నయార్యునిగద్యములతోసయితము సాటివచ్చుచుండును. తెలుఁగుఁ గూర్పులగూడఁ గొండొక కలయఁ గూర్చినను బోతనామాత్యుఁడు వచనములను గడునిడుదలుగను గఠినములుగను నెలకొల్పెను. పెద్దనాదుల కృతులందు వచనములు మిక్కిలి తక్కువ ఉన్నను వర్ణనాత్మకములై యతిప్రౌఢములై యుండును. పెద్దనాదులకుఁ దర్వాతికవులు కొందఱు పద్యములందు వలయు గణయతి ప్రాసనిర్బంధము లేమిచేఁ