పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

మీఁగడ తఱకలు

          శ్రీరాగం-దేశాది
నామకుసుమములచేఁ బూజించే
నరజన్మమే జన్మము మనసా ||నా||

శ్రీమన్మానసకనకపీఠమున
చెలఁగఁ జేసికొని వరశివరామ ||నా||

నాదస్వర మనేవరనవరత్నపు
వేదికపై సకలలీలావి
నోదుని పరమాత్ముని శ్రీరాముని
పాదములను త్యాగరాజహృద్భూషణుని ||నా||

భగవత్ప్రాప్తికి సూటి యైనదగ్గఱిమార్గ మగుహఠేతర యోగప్రభేద ప్రకారము ఆంధ్రదేశమున సర్వదా అభ్యుదయము నందుచుండునుగాక. త్యాగరాజుగారివంటి మహనీయులు ఆంధ్రదేశమున తనరారుచుందురు గాక!

- 2 -

త్యాగరాజస్వామి! మీయద్వైతానుభూతి మా కానందము గొల్పుచున్నది. మీరు శివ దేవీ రామ కృష్ణ లక్ష్మీ సరస్వత్యాదిదేవతలను నాయాపుణ్యస్థలముల యర్చామూర్తులను స్తుతించుచుఁ గృతులను రచించితిరి గాని, యన్నింటను నీశ్వరాద్వైతానుభూతినే భగవంతుని సచ్చిదానందాత్మకతనే వ్యక్తపఱిచితిరి!

మీకృతులలో భావరాగతాళములు పరస్పరము సమేళమై యానుకూల్యముతో నైక్యముతోఁ బ్రస్తారము చెంది చెంది, యాహ్లాద వినోదములలరార్చి ముక్తాయింపుముగింపులో మూఁడును చరమానందమున సమన్వితము లగుతీరులు మామనసుతలఁపును, నోటిపలుకును, మేనిచెయిదమును నైక్యపరిపాకమునకుఁ దార్చి, మాజీవితములనే దివ్యసంగీతములఁ గావించి, మమ్ముఁగూడ సుకృతులఁగా వెలయించుఁ గాక!