పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



13

త్యాగరాజు

ఆంధ్రదేశము కర్మఠప్రచుర మయినది. ఆంధ్రబ్రాహ్మణులు శ్రౌతస్మార్తకర్మపరాయణులు. తక్కినవర్ణములవారును వీరి ననువర్తించిన వారే. పాశుపతకాలాముఖశైవములు, జైనబౌద్ధములుగూడ నాంధ్రులలో సురూఢము లయినవి. శంకరుల తర్వాత పైమతముల యెగుపును తగ్గించి యధికముగా నద్వైతమతమును, రామానుజులతర్వాత రెండు మూఁడుశతాబ్దులకుఁ గొలఁదికొలఁదిగా వైష్ణవమును దెలుఁగుదేశమున నభివ్యాపించినవి. ఆంధ్రదేశమునందు ద్వైతమతప్రచారము చాల నర్వాచీనము. ఇన్నిమతములు వ్యాపించి సాగుచున్నను నాంధ్రులలో బ్రాహ్మణులు, నితరవర్ణములవారు యోగప్రభేదము లగు మంత్ర, భక్తి, లయ, హఠ, తారకరాజాదియోగప్రభేదముల యోగవిద్య నధికముగా నభ్యసించుచు వచ్చిరి. శైవులు, శాక్తులు, వైష్ణవులు నధికముగా మంత్ర యోగము నభ్యసించిరి. వేమన, పోతులూరి వీరబ్రహ్మాదులు హఠ యోగమును సాధించిరి. పోతన, రామదాసు, ప్రకాశదాసు మొదలగువారు భక్తిలయయోగపరాయణు లయిరి. దక్షిణదేశమున నెలకొన్నను,త్యాగరాజు కూడ నక్కడి యాంధ్రులయిననారాయణతీర్ణులవలె భక్తిలయయోగముల ద్వారమున సంగీతరూప మగునాదబ్రహ్మానందరసము ననుభవించిరి. బాహ్యమయినమూర్త్యారాధనముకంటె త్యాగరాజుగా రధికముగా నంతర్యామ్యర్చనమునే కావించిరి. త్యాగరాజుగారి కీర్తనలలోఁ బెక్కింట నీవిషయము ప్రవ్యక్త మగును. బాహ్యము లయిన తీర్ధములను గంగాధనుష్కోట్యాదులను దిరిగి యారాధించుటకంటె నంతరంగమునఁ గలగంగాధనుష్కోట్యాదుల నర్చించుటలో బాహ్యము లయినకోటితీర్ధముల నర్చించుఫలము లభించు నని యీక్రిందికీర్తనమున త్యాగరాజుగారు