పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/172

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

153


వెల్లడించిరి. ధను వనఁగా వెన్నెముక. దాని కోటి యగ్రము నాసాగ్రము గాని మూలాధారకుండలినీస్థానముగాని యగును. ఈకీర్తన మీయర్ధమును నిరూపించుచున్నది.

             తోడి - ఆది
కోటినదులు ధనుష్కోటిలో నుండఁగా
ఏటికి తిరిగేవే ఓమనసా ! ||కోటి||

సూటిగ శ్యామసుందరమూర్తిని
మాటిమాటికిఁ జూచేమహారాజులకు ||కోటి||

గంగ నూపురంబునను జనించను
రంగనిఁ గావేరి గని రాజిల్లను
బొంగుచు శ్రీరఘునాథుని ప్రేమతోc
బొగడేత్యాగరాజమనవి వినవే ||కోటి||

వెన్నెముక నడిమి దగుసుషుమ్నకు రెండుపార్శ్వములను ఇడాపింగళానాడులు సాగుచున్నవి. మూఁడు నాడులును ధనుష్కోటిలో నాసాగ్రము గాని, కుండలిని గాని, రెండింటిలో నేస్థల మయినను, నక్కడ నేకీభవించుచున్నవి. శ్రుతితాళగేయములు సంగీతారంభమునను నవసానమునను నట్లే ముక్తాయింపులో నేకీభవించుచున్నవి. ఈ యేకీభావమునకే లయ మని నామాంతరము. త్యాగరాజుగా రీలయ బ్రహ్మానందరసమును సర్వదా యనుభవించుచు ధనుష్కోటిలో నానంద సాగరమున నోలలాడుచునుండిరి.

పై యర్ధమునే త్యాగరాజుగా రీసంకీర్తనమున మఱియు వివరించిరి.

                 గరుడధ్వని - దేశాది
ఆనందసాగర మీదనిదేహము భూభారమె రామ
శ్రీనాయకాఖిలనైగమాశ్రితసంగీతజ్ఞాన మనుబ్రహ్మా
శ్రీవిశ్వనాథ శ్రీకాంతవిధులు పావనమూర్తు లుపాసించలేదా
భావించి రాగలయాదుల భజియించే శ్రీత్యాగరాజనుత II ఆII