పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

115

ఈ కథలలో నాయిక వరూధిని. దేవయోని జాతులలో, ననఁగా-గంధర్వ, విద్యాధర, యక్ష, కిన్నర, కింపురుషాదులలో నొకటయినయప్సరోజాతిపడుచు. అప్సరసలు దేవవేశ్యలు. వారికిఁ బద్మసంభవ, వైకుంఠ, భర్గ, దేవేంద్రసభలు సంగీతనాట్యవిద్యల సాముగరిడీలు. కామకలావిలాసములు వెన్నతో నేర్పిన విన్నాణములు,

గంధర్వ విద్యాధరాదులతోడనే కాక భువినుండి దివికి విచ్చేసెడి జ్యోతిష్టోమాది యాజులతోఁగూడ శృంగారవిహారములు వీరి కులాచార ధర్మములు. వారు వీ రనుహద్దు లేక అందఱితోడను వినోదించెడివారు గనుక నీవేశ్యలు సామాన్యవనితలు.

భూలోకమున నెవ్వరైనc దీవ్రతపముచేయుచు నింద్రపదవికే ముప్పు దెచ్చున ట్లుండుచో వారితపమును జెఱుచుటకు దేవేంద్రుఁడు వీరినే ప్రయోగించుచుండును. వీరు నిత్యయౌవనలు, ఎప్పుడును ముప్పదేండ్ల వయోవిలాసముతో నుండువారు. వ్యాధులు, జరామరణాదులు వీరి కుండవు.

ఇట్టి యప్సరసను, వరూధినిని, వీరితోఁ గలసి మెలసి విహరించు జాతిలోనివాఁడే యయినగంధర్వుఁ డొకఁడు కలి యనువాఁడు వలచి, తత్కాలమునకు వలపించుకొనలేక ఉపాయములు వెదకుచు వెంటాడుచుఁ దంటాలు పడుచుండినాఁడు,

ఉII ఒక్కొకవేళఁ బద్మముఖు లొల్లమి సేయుదు రొకవేళఁ బె
     న్మక్కువ నాదరింతురు క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్
     పక్కున వేసఱన్ జన దుపాయములన్ దగు నిచ్చకంబులన్
     జక్కగఁ జేసి డాసి సతిచిత్తముcబట్టి సుఖింపగాఁ దగున్.

అనుకొనుచుండును.