పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

మీఁగడ తఱకలు

మనుచరిత్రలో వరూధినికై తలమార్చుకొని, దొంగవేషము వేసికొనినగంధర్వునిపేరు కలి.

మేఘసందేశమున కాళిదాసు యక్షు ననామధేయునిగాఁ జేసినట్లే మనుచరిత్రమునఁ బెద్దన్న కూడ గంధర్వు ననామధేయునిఁ జేసినాడు. 'కలి' యన్న పేరు పేర్కొనలేదు.

ప్రధానముగ వరూధినీప్రవరుల సమాగమ కథను హృదయమున నునిచుకొనియే రాయలవారు పయి విధముగ మనుచరిత్రము రససమంచిత కథలలో నున్న దనియు, కలిధ్వంసక మనియు, పెద్దన్నచతురరచన కనుకూల మయిన దనియు పలికియుందురు.

రాయలవారి కోర్కి గావుననే పెద్దనామాత్యుఁడు, స్వారోచిషమను సంభవ కథను గ్రంథము కట్టకడపట నెక్కడనో రెండుముక్కలలో నెత్తుకొని ముగించినప్పటికిని, వారియవ్వాతాతలకథనుమాత్రము-అనఁగా వరూధినీప్రవరుల, వరూధినీ గంధర్వుల కథను-మూఁ డాశ్వాసముల పైదాఁకఁ బెంచి ప్రబంధీకరించినాడు.

నేఁడు మనుచరిత్ర మనఁబడునీప్రబంధమునఁ దొలినాలుగయి దాశ్వాసముల రచనను స్వరోచిస్సంభవ మనియు, నాతరువాత నాఱవ యాశ్వాసము తుదిదాఁకఁ గల రచనను స్వారోచిషసంభవ మనియు వేర్పఱచి రెండు ప్రబంధములుగా నేను పేర్కొందును. రెండు ప్రబంధములను రాయల కంకితముగా నొక కృత్యవతరణికతో నొకసంపుటముగా సంధానించినాఁడు గనుక మొత్తము సంపుటమును మనుచరిత్ర మని పేర్కొనుచుందును.

పయి రెండు ప్రబంధముల తీరులు పరిశీలనార్హములే యయినను ప్రస్తుతము నేను తొలిప్రబంధముగ పరిగణించుచున్న స్వరోచిస్సంభవమును గూర్చియు, నందులోని కథారసౌచిత్యమునుగూర్చియుమాత్రమే యించుక ప్రపంచింతును.