పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/132

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

మనుచరిత్ర

ఆనాcడు దిగ్విజయయాత్రలో కృష్ణదేవరాయలవారు విజయవాడలో విడిసి యున్నప్పుడు పెద్దనకూడ వెంట నుండెనఁట. అప్పుడు విజయవాడ విద్వాంసులకు తన మనుచరిత్రమును వినిపించికూడ నుండవచ్చును. కృష్ణదేవరాయలవారు

కం|| మనువులలో స్వారోచిష
       మనుసంభవ మరయ రససమంచితకథలన్
       వినిపింపు కలిధ్వంసక
       మనఘ! భవచ్చతురరచన కనుకూలంబున్.

కావున మార్కండేయపురాణోక్తప్రకారంబునఁ దానిఁ దన కంకితముగాఁజేయుఁ డనిరఁట!

ప్రపత్తిపరుఁ డయినపెద్దన కలిధ్వంసకము కానికథను చెప్పఁడుకదా!

ఇప్పుడు దొరకుట లేదు గాని శఠకోపయతి కర్పితముగ 'హరికథాసార' మని మఱియొక గ్రంథమును పెద్దన రచించినాఁడు. షట్చక్రవర్తుల, అష్టవసువుల, చతుర్దశమనువుల, షోడశమహారాజుల చరిత్రలు కలిధ్వంసకము లని పురాణోక్తి.

ఈ మనుచరిత్రలో కడపటిపట్టున స్వారోచిషమనువు పుట్టుక కలదు. గనుక దానితో ననుబంధము గలప్రబంధమంతయును కలిధ్వంసకమే యగునుగదా యని పెద్దన తనమనమును సమాధానపఱచుకొని యుండును,

కాని యథార్థమున కీకథ కలి యనెడి గంధర్వుని ధ్వంసము చేసినది గనుక కలిధ్వంసక మని చెప్పుకొనుట యుక్తము.