పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

మీఁగడ తఱకలు


స్థిరపఱచుచున్నది. ఉద్భటారాధ్యచరిత్రలో రామలింగఁడు తన యింటిపేరేదో పేర్కొననే లేదు. రామకృష్ణుఁడై పాండురంగమాహాత్మ్యమునను బేర్కొనలేదు. 'శ్రీతెనాల్యగ్రహారనిర్ణేత' నని మాత్ర మందుఁ జెప్పుకొన్నాఁడు. అప్పటికిఁ దెనాలివా రని యింటిపేరు స్థిరపడకుండవచ్చును. అన్నయ సుదక్షిణా పరిణయమునఁ 'దెనాలి' యింటిపేరు చెప్పకొన్నాఁడు.

మనుమఁ డగురామభద్రకవి చెప్పుటచేతను, దల్లిపేరు మొదలగునవి సరిపోవుటచేతను రామకృష్ణుఁడును, నన్నయయు నన్నదమ్ము లని స్పష్టపడినది. ఉద్భటచరిత్రమందుఁ గానవచ్చు రామ (లింగే)శ్వరస్వామి యనుగ్రహము, పాలగుమివారిశిష్యత్వము,శైవాచారము మొదలగునవి సరిపోవుటచేతను, లోకమందుఁ బారంపర్యముగా వచ్చుచున్నప్రతీతికిఁగూడ నిర్వాహ మేర్పడుటచేతను, నుద్భటారాధ్యచరిత్ర కర్తయగురామలింగయయే వైష్ణవమతము పుచ్చుకొని రామకృష్ణుడై పాండురంగమాహాత్మ్యము రచియించినాఁ డని, వారు వేఱుపురుషులుగారని, నిర్ణయించుట ప్రమాణదూరము కాదు.

పోలికలు

రామలింగకవియే రామకృష్ణుఁ డయ్యెననుట కింకను మఱియొక బలవత్ప్రమాణము చూపెదను. పాండురంగ మాహాత్మ్యమున శైవవైష్ణవ పురాణావళీనానార్థరచనాపటిష్ఠైకరమ్యమతివి' యని చెప్పఁబడుటచేనాతఁ డేవో శైవపురాణ కథల రచియించి యుండవలె ననియు నీయుద్భటారాధ్య చరిత్రము వానిలోనిది యగు ననియు ననుకొంటిమి. తొలుతఁ దాను శైవుఁడై యున్నపుడు రచియించిన యుద్భటారాధ్యచరిత్రములోని పద్యములే మార్చీ మార్చకుండఁ దర్వాత వైష్ణవుఁడై రచించిన ఘటికాచల మాహాత్మ్యమున నాతఁడు చేర్చుకొన్నాడు. ఇవిగో చూడుఁడు.