పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

99


జేర్చుకొన్నదేమో! రామకృష్ణకవి తనమతముమార్పును దెలుపుకొనకున్నను, బాండురంగమాహాత్మ్యమున 'శైవవైష్ణవపురాణావళీ నానార్థరచనా పటిష్ఠైకరమ్యమతివి[1] అని తన శైవప్రబంధరచనమును దెలుపకొన్నాఁడు.

తెనాలిలోనుండుచేతనే తర్వాత తెనాలివారని యింటిపే రేర్పడినది గాని యంతకుముందు వారియింటి పేరు గార్లపాటివా రని ప్రాఁతవ్రాఁతలలో నున్నది. గురుజాడ శ్రీరామమూర్తి పంతులుగారును వీరేశలింగము పంతులుగారును దీనిని జెప్పిరి. తెనాలిలో నున్నరామయ పండితుఁడు శైవాచారపరుఁడుగాన యక్కడ వెలసియున్న రామలింగస్వామిపేరే తనప్రథమపుత్త్రునికిఁ బెట్టుకొనె నని నేను దలంచుచున్నాఁడను. అన్నయ చెప్పుటచేతనేకాక యీక్రిందిసాధనముచేతఁ గూడ నాతఁడు శైవాచారపరుఁడని రామలింగేశ్వరస్వామిభక్తుఁ డని యేర్పడుచున్నది.

తెనాలిలో రామలింగేశ్వరస్వామి యాలయమున నొక యుత్సవ విగ్రహముపీఠముమీఁద నీశ్లోక మున్నది.

శ్లో|| శ్రీ తెనాలినగరే వ్యరాజయ ద్గార్లపాటిపురరామపండితః
      శుక్లమాఘసిత పంచమీ గురౌ రామలింగ ముమయోత్సవాకృతిమ్.[2]

రామలింగని యింటిపేరు గార్లపాటివా రని యిదివఱకు వ్రాసినవా రెవ్వరు గాని యీశ్లోకము నునికి నెఱిఁగినట్లు తెలియరాలేదు. రామలింగని యింటిపేరు తొల్త గార్ల పాటివా రనుట నీశాసనశ్లోకము

  1. శైవవైష్ణవ పురాణావళీ నానార్ధములు నీకుఁ గరతలామలకనిభము లని పాఠాంతరము కలదు. పాండురంగమాహాత్మ్యమున నీపద్యము పాఠభేదములతో నున్నది.
  2. ఈ శ్లోకమునుగూర్చి గుంటూరిలో శ్రీమల్లాది సోమయాజులుగారు నాకుఁ జెప్పిరి. పిదపఁ గొంతకాలమునకు దాని నేను జూచితిని, ఇప్పు డొకమిత్రుఁడు చూచి వ్రాసి పంపెను. శుక్ల సం!! మాఘ శుద్ధ పంచమీ గురువారము స్వామికణ్ణుపిళ్లగారిపుస్తకమునుబట్టి చూడఁగా సరిపడకున్నది.