పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

మీఁగడ తఱకలు



-4-

నగరు, తగరు, తొగరు, పగరు అని చరణాద్యక్షరము లుండునట్లు రామాయణ, భారత, భాగవతపరములుగా మూఁడు పద్యములు చెప్పు మని పెద్దన సమస్య యడుగఁగా నట్లే చెప్పి సత్కృతుఁ డయినచింతలపూడి యెల్లయకవికి శ్రీకృష్ణరాయలు రాధామాధవుఁ డని బిరుదనామ మిడెను.

శా|| రాధామాధవ మచ్యుతాంకితముగాఁ బ్రౌఢక్రియం జెప్పి త
      న్మాధుర్యంబునఁ గృష్ణరాయవిభుఁ గర్ణాటేశు మెప్పించి నా
      నాధాతృప్రతిమానసత్కవులలోనన్ భూషణశ్రేణితో
      రాధామాధవనామ మందినజగత్ప్రఖ్యాతచారిత్రుఁడన్

ఈరాధామాధవకవికృతులు రాధామాధవము, విష్ణుమాయావిలాస నాటక ప్రబంధము, తారకబ్రహ్మరాజీయము ననునవి దొరకియున్నవి.

- 5 -

ఆముక్తమాల్యద కృష్ణదేవరాయవిరచిత మని గ్రంథమం దున్నను బెద్దన రచించిన దని లోకమునఁ బ్రతీతి కలదు. వ్యాఖ్యాతలు లాక్షణికులు కొంద ఱట్లే గ్రంథములందును జెప్పినారు. ఆముక్తమాల్యదావ్యాఖ్యాత శ్రీనివాసకవి-

ఉ|| ఉరు వగువిష్ణుచిత్తతనయోద్వహనంబును సంస్కృతాంధ్రవా
     గ్గరిమ నలంక్రియారససఖం బగునట్లుగఁ బెద్దనార్యుఁ డు
     ద్దురభణితిన్ రచించె నది దుర్ఘటబోధము గావునన్ ధరన్
     స్థిర మగుచుండునట్లుగను జేసెదఁ డీక సవిస్తరంబుగాన్

గుడిపాటి వెంకటకవి -

గీ|| ప్రేమ నల్లసాని పెద్దన యాముక్త
     మాల్యదాఖ్యకృతి సమంచితముగఁ
     జేసె నీవు టీక చేయుము చెఱకునఁ
     బండు పండినట్టు లుండుఁ గాన.