పుట:Mana-Jeevithalu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

చేరుకోలేము. ఏమార్గాన్ని అవలంబించినా అది సాధ్యంకాదు. అన్ని మార్గాలూ, లక్ష్యాలూ ఒకే విధమైన బంధనాలు. అవన్నీ వదులుకోవాలి వాస్తవిక స్థితి కోసం.

15. వ్యక్తిలోని బహుముఖాలు

ఒకాయన తన శిష్యుల్ని వెంటబెట్టుకుని మమ్మల్ని చూడటానికి వచ్చాడు. వాళ్లలో అన్ని రకాల వాళ్లూ ఉన్నారు - డబున్నవాళ్లూ; బీదవాళ్లూ, ఒక ఉన్నత ప్రభుత్వోద్యోగీ, ఒక వితంతువూ, మత దురభిమాని ఒకడూ, చిరునవ్వుతో ఉన్న ఒక యువకుడూ. వాళ్లంతా సరదాగా, సంతోషంగా ఉన్నారు. ఆ తెల్లటి ఇంటి మీద నీడలు నాట్యం చేస్తున్నాయి. దట్టంగా ఉన్న ఆకుల మధ్య చిలకలు కీచుగా అరుస్తున్నాయి. ఒక లారీ పెద్ద చప్పుడు చేస్తూ వెళ్ళింది. ఆ వచ్చిన వాళ్లలో యువకుడు, గురువుకి, బోధకుడికి ఎంత ప్రాముఖ్యం ఉందో ఎంతో తీవ్రంగా ఉద్ఘాటిస్తున్నాడు. తక్కిన వాళ్లు అతనితో ఏకీభవిస్తున్నారు. అతడు స్పష్టంగా, నిష్పక్షపాతంగా వాదిస్తూంటే ఆనందంతో చిరునవ్వు నవ్వుతున్నారు. ఆకాశం ఎంతో నీలంగా ఉంది. మెడదగ్గర తెల్లగా ఉన్న ఒక డేగ మాపైన చుట్టూ తిరుగుతోంది. రెక్కలు కొంచమైనా విదల్చకుండా. ఆ రోజు ఎంతో చక్కగా ఉంది. మనం ఒకరినొకరు ఎలా నాశనం చేసుకుంటాం - శిష్యుడు గురువునీ, గురువు శిష్యుణ్ణీ! అనుగుణంగా ఎలా వర్తిస్తూ ఉంటాం, విడిపోయి మరోలా ఎలా రూపొందుతూ ఉంటాం! ఒక పక్షి పొడుగాటి పురుగుని తడిమట్టి లోంచి లాగుతోంది.

మనలో ఉన్నవి ఎన్నో; ఒకటి కాదు. ఆ ఉన్నవన్నీ పోతేగాని ఒకటి అవదు. అవన్నీ ఒకటితో ఒకటి పోట్లాడుకుంటూ రోజూ రాత్రీ, పగలూ గొడవ చేస్తూ ఉంటాయి. ఈ పోరాటమే జీవితంలోని బాధ. ఒకదాన్ని నాశనం చేస్తాం. దాని స్థానంలో మరొకటి బయలు దేరుతుంది. ఈ రకంగా అనంతంగా సాగుతూ ఉన్నట్లుండేదే మన జీవితం. వాటిల్లో ఒకదానికి తక్కిన వాటి కన్న ఆధిక్యాన్నిస్తాం. కాని, ఆ ఒకటి త్వరలోనే అనేకం అవుతుంది. అనేకమైన వాటి గొంతు ఒక్కటిగా వినిపిస్తుంది. ఆ ఒక్క గొంతూ అధికారాన్ని చెలాయిస్తుంది.