పుట:Mana-Jeevithalu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రస్తావన

ఈ సంవత్సరం రెండు కొత్త పుస్తకాలను విడుదల చేస్తున్నాం. అందులో మొదటిది “మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు” అన్న యీ ప్రస్తుత గ్రంథం. ఇది కామెంటరీస్ ఆన్ లివింగ్ (ఫస్ట్ సిరీస్) అనే ఆంగ్ల రచనకు శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు తేట తెలుగులోనికి చేసిన యథాతథ అనువాదం.

తక్కిన పుస్తకాల కంటె కామెంటరీస్ ఆన్ లివింగ్‌కు ఒక ప్రత్యేకత ఉన్నది. కృష్ణమూర్తి ప్రచురణలలో ఎక్కువ భాగం వివిధ సందర్భాల్లో, వివిధ ప్రదేశాల్లో చేసిన ప్రసంగాలు కాగా యీ ప్రస్తుత గ్రంథం ఆయన స్వయంగా చేసిన లిఖిత రచన. వివిధ దేశాలలో పర్యటిస్తున్నప్పడు సామాన్యులుగా, ప్రముఖులూ కూడా ఎంతోమంది తమ సమస్యలను, ఆవేదనలను వెల్లడించుకునేవారు. ఆంగ్లంలో వ్రాసి పెట్టుకున్న యీ ఉదంతాలను చదవడం వల్ల ఎందరికో ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో మూడు భాగాలుగా వీటిని ప్రచురించడం జరిగింది. ప్రస్తుతం మీ చేతిలో ఉన్నది మొదటి సంపుటానికి తెలుగు అనువాదం.

జిడ్డు కృష్ణమూర్తి 1895లో మే 11వ తేదీన మదనపల్లిలో జన్మించారు. 14వ ఏట దివ్యజ్ఞాన సమాజం వారు చేరదీయగా, అనీబిసెంట్ సంరక్షణలో పెరిగారు. భావికాలంలో జగద్గురువుగా భాసిల్లాలని కృష్ణమూర్తికి శిక్షణనిచ్చారు. అయితే 1929లో హాలెండులో జరిగిన సమావేశంలో జగద్గురువు అనే యీ అత్యున్నతమైన పదవినీ, తమ చుట్టూ ఏర్పడిన సంస్థలను, అశేషమైన ఐశ్వర్యాన్నీ అవలీలగా పరిత్యజించి వేసి, ఒంటరిగా నిలబడ్డారు. ఏ సంస్థల ఆధ్వర్యమూ లేకుండానే ప్రపంచమంతా పర్యటించి, మానవుడిని దుఃఖాల నుండి, సమస్త బంధనాల నుండి విముక్తం చేయడమే ప్రధానాంశంగా ప్రసంగించారు. సత్యం అనేది బాటలు లేని సీమ అనీ, దానిని చేరుకోవడానికి మతాలుగానీ, సంస్థలుగానీ, గురువుగానీ అవసరంలేదనీ నొక్కి చెప్పారు.

మత ధర్మమూ, తాత్వికతా, మనోతత్వ విచారణా కలిసి అపూర్వమైన తీరులో సమ్మేళవించుకున్న కృష్ణమూర్తి బోధనలు సమగ్రమైన సంపూర్ణ జీవిత దర్శనాన్ని నిర్దుష్టశైలిలో మనకు అందిస్తాయి.