పుట:Mana-Jeevithalu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధికార శక్తి

93

గాని, పరులను దోచుకోవటం వల్ల గాని, ఆత్మత్యాగం వల్ల గాని, పొందిన అధికారం పైకి కనిపించకుండా పట్టుబడుతుంది. ఏ రకమైన విజయం సాధించినా, అది అధికారమే. ఓటమి కేవలం గెలుపు లేకపోవటమే. అధికారంతో ఉండటం, జయించడం అంటే బానిసగా ఉండటమే. అంటే సద్గుణం లేకపోవడమే. సద్గుణం స్వేచ్ఛనిస్తుంది. కాని, అది పొందగలిగినది కాదు. ఏది సాధించినా, వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని, అది అధికారానికి సాధనం అవుతుంది. ఈ ప్రపంచంలో విజయవంతం అవటాన్నీ, ఆత్మనిగ్రహం ద్వారా, ఆత్మత్యాగం ద్వారా పొందే అధికారాన్నీ తప్పించుకోవాలి - ఆ రెండూ అవగాహనని వికృతం చేస్తాయి కనుక. విజయవంతం కావాలనే కోరిక నమ్రత లేకుండా చేస్తుంది. నమ్రత లేకుండా అవగాహన ఎలా కలుగుతుంది? విజయవంతమైన మనిషి కఠినంగా స్వార్ధ పరాయణుడిగా అవుతాడు. అతని ప్రాముఖ్యంతో, బాధ్యతలతో సాధించిన వాటితో జ్ఞాపకాలతో అతనికి భారం పెరుగుతుంది. తనకు తాను తెచ్చిపెట్టుకున్న భాధ్యతలనుంచీ, సాధించిన దాని భారం నుంచీ స్వేచ్ఛ పొందాలి. భారంతో క్రుంగిపోయేవాడు చురుకుగా ఉండలేడు. అవగాహన చేసుకోవటానికి చురుకైన, మృదువైన మనస్సు ఉండటం అవసరం. విజయవంతులైన వారికి దయ ఉండదు. వారికి ప్రేమ అనే జీవిత సౌందర్యాన్ని తెలుసుకునే శక్తి ఉండదు.

విజయవంతం కావాలని కోరటం అంటే ఆధిపత్యాన్ని కోరటం. ఆధిపత్యం వహించటం అంటే సొంతం చేసుకోవటం. తన్నుతాను ప్రత్యేకించుకునే పద్ధతి. మనలో అనేకమంది కోరుకునేది ఈ స్వయం ప్రత్యేకత - పేరు ద్వారా, సంబంధం ద్వారా, పని ద్వారా, భావకల్పన ద్వారా గాని, ప్రత్యేకతలో అధికారం ఉంటుంది. అధికారం వల్ల వైరుధ్యం, బాధా పెంపొందుతాయి. ప్రత్యేకత భయం మూలాన్ని వచ్చినది. భయం సంపర్కాన్ని పూర్తిగా అంతం చేస్తుంది. సంపర్కమే సంబంధం. సంబంధం ఎంత సంతోషకరమైనా, బాధాకరమైనా, దానివల్ల తన్ను తాను మరిచిపోయే అవకాశం ఉంటుంది. ప్రత్యేకత అనేది అహం అవలంబించే మార్గం. అహంతో కూడిన కార్యకలాపాలన్నీ సంఘర్షణకీ, దుఃఖానికీ కారణమవుతాయి.