పుట:Mana-Jeevithalu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34. చిత్తశుద్ధి

పచ్చని చిన్న మైదానం, దాని చుట్టూ అంచున కళకళలాడుతూ పువ్వులు. ఎంతో జాగ్రత్త తీసుకుని దాన్ని అందంగా ఉంచారు. ఎండ మాత్రం వీలైనంత వరకు గడ్డిని మాడ్చేసి పువ్వులు ఎండిపోయేట్లు చేస్తోంది. ఈ ముచ్చటైన తోటకి అవతలున్న కొన్ని ఇళ్లు దాటితే నీలిరంగు సముద్రం ఎండకి తళతళలాడుతోంది. దానిమీద తెల్లని తెరచాపతో ఒక ఓడ. గదిలోంచి చూస్తే క్రిందనున్న తోట, ఇళ్ల కప్పులు, చెట్లపైభాగం కనిపిస్తాయి. ఆ గది కిటికీ లోంచి ఉదయం పూటా, సాయంకాలం పూటా సముద్రం చూడటానికి హాయిగా ఉంటుంది. పగటిపూట దాని నీళ్లు కాంతివంతంగా కఠినంగా ఉన్నట్లుంటాయి. కాని, మిట్ట మధ్యాహ్నం కూడా ఓడ తెరచాప కనిపిస్తూనే ఉంటుంది. సూర్యుడు సముద్రం లోపలికి వెళ్ళిపోతాడు మెరిసే ఎర్రని బాట వేస్తూ సంధ్య వెలుగు ఉండదు. నక్షత్రం ఒకటి ఆకాశం మీద తిరిగి అంతలోనే మాయమవుతుంది. అప్పుడే ఉదయిస్తున్న చంద్రుని ఛాయ సాయంకాలాన్ని ఆవరించుకుంటుంది. కాని అంతలోనే చంద్రుడు కూడా ఆ కల్లోలిత సముద్రంలోకి మాయమవుతాడు. నీళ్లనిండా చీకటి నిండుతుంది.

ఆయన చాలాసేపు భగవంతుడి గురించీ, మొక్కల గురించీ, సంధ్యా వందనాల గురించీ, ఉపవాసాల గురించీ మాట్లాడాడు. మొక్కల గురించీ, రగులుతున్న కోరికల గురించీ, చాలా స్పష్టంగా, నిశ్చితంగా వ్యక్తం చేశాడు. సరియైన మాటలకోసం తడుముకోవటం లేదు. ఆయనది బాగా శిక్షణ పొందిన మనస్సు. ఆయన ఉద్యోగానికి కావలసినదే అది. ఆయన కాంతివంతమైన కళ్లతో చురుకుగా చూస్తున్నాడు, కొంత కఠినత్వం ఆయనలో ఉన్నప్పటికీ. లక్ష్యసిద్ధికోసం పట్టుదల, లొంగే స్వభావం లేకపోవటం కనిపిస్తున్నాయి ఆయన కూర్చున్న తీరులో. ఆయనలో ఏదో అసాధారణమైన ఇచ్ఛాశక్తి ప్రేరణ ఉన్న సంగతి స్పష్టమవుతోంది. ఆయన చిరునవ్వు నవ్వినా, ఆయన మనస్సు చురుకుగా పర్యవేక్షణ చేస్తూ, తన ఆధిక్యతని చూపిస్తూనే ఉంది. ఆయన దైనందిన జీవితంలో చాలా సక్రమంగా ఉంటాడు. తాను అలవరచుకున్న అలవాట్లను తన ఇచ్ఛానుసారంగానే మార్చుకుంటాడు. ఇచ్ఛ