పుట:Maharshula-Charitralu.firstpart.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగస్త్యమహర్షి

25

ఆ పిమ్మట సతీసహితుఁడై అగస్త్యుఁడు శ్రీ శైలమునకుఁ బ్రదక్షిణ నమస్కారము లొనరించి ముందున కేఁగి స్వామిమలఁ జేరి యందుఁ గుమారస్వామిని దర్శించెను.

కుమారాగస్త్య సంవాదము

కుమారస్వామి పత్నీ సహితుఁ డైన అగస్త్యమహర్షిని రమ్మని కుశలమడిగి కూర్చండ నియమించి వచ్చినపని యడిగెను. అగస్త్యుఁడు కాశీమాహాత్మ్యమును దెలుపుమని కోరెను. కుమారస్వామి “అయ్యా ! నన్నడిగితివి కాని కాశీమాహాత్మ్య మెవ్వరును వర్ణింపఁ జాలరు. యధాశక్తిఁ దెలిపెదను. నిన్నుఁ గోల్లాపుర లక్ష్మి యిచటికిఁ బుత్తెంచుట యెఱుఁగుదును. కాన, నీ వేమి వినవలతువో కోరుకొమ్మనెను. అంత , అగస్త్యుఁడు కుమారస్వామికి నమస్కరించి కాశికిఁ గల నామములు, విశేషములు తెలుపమనెను. కుమారస్వామి యవి యెల్లఁ దెలిపెను. పిదప నాతఁడు మణికర్ణికా మాహాత్మ్యము, కాశీతీర్థమాహాత్మ్యము, కాలభైరవచరిత్రము, హరికేశచరిత్రము, జ్ఞానవాపికాతీర్థ మాహాత్మ్యము. కళావతికథ, అగస్త్యునకుఁ దెలిపెను. పిదప, సదాచార నిరూపణముఁ జేయుమనఁ గుమారస్వామి "ఋషీంద్రా! మనువు, అత్రి భృగువు, భరద్వాజుఁడు, యాజ్ఞవల్క్యుఁడు, ఉశనసుఁడు, అంగీరసుఁడు, యముఁడు, ఆప స్తంబుఁడు, సంపర్తుఁడు. కాత్యాయనుఁడు, బృహస్పతి, శాతాతపుఁడు, శంఖుఁడు. లిఖితుఁడు, పరాశరుఁడు మున్నగువారు సదాచారము నిరూపించిరి. అవి యెల్లఁ దెలుప సాధ్యముకా" దని దిజ్మాత్రముగఁ దెలిపెను. పిదప, కాశీనగరమును గుఱించిన సమస్త విషయములు అగస్త్యుసకుఁ గుమారస్వామి తెలిపెను. ఇవన్నియు విని అగస్త్యుఁ డానందించి సభార్యుఁడై స్వామి నారాధించి సెలవు గైకొని ముందునకుఁ బయనమై పోయెను.[1]

  1. స్కాందపురాణము - భీమఖండము.