పుట:Maharshula-Charitralu.firstpart.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

మహర్షుల చరిత్రలు


ద్వారక , సరస్వతి, మున్నగున వెల్ల ముక్తి కారకములగు తీర్థములు. నీకొక్క రహస్యము చెప్పెద. ఈశ్వర కటాక్షము లేక పోయినచో దీర్థయాత్ర చేయవలెనను బుద్ధియే పుట్టదు. తీర్థయాత్రా కాంక్ష లేనిచోఁ బ్రతిబంధ పాపము పోవదు. ఆ పాపము నశింపనంత వఱకుఁ గాశీప్రాప్తి లేదు. కాశీవాస యోగము లేనిచో విజ్ఞానము విస్తరింపదు. జ్ఞానమునఁగాని మోక్షము లేదు. వేదాంత వాక్యముల వలనఁ బుట్టిన సుజ్ఞానమే జ్ఞానము. మిగిలిన దెల్ల అజ్ఞానము. -

తరుణీ! మానస తీర్ధములే మోక్షహేతువులు. బాహ్య తీర్థములకంటె నివి మేలు. అవియేవందువా వినుము. సత్యము, ఇంద్రియనిగ్రహము, అనసూయ, దానము, దయ, సంతోషము, బ్రహ్మచర్యము, ధైర్యము, యమము, సమత్వము, విజ్ఞానము ఇవన్నియు మానస తీర్థములు. ఇవియాడనివారికి బాహ్యతీర్థము లాడుట వలన నించుకంతయైనను బ్రయోజనము లేదు. ఏలయందువా తీర్థజలములలో మునిఁగినంతనే మోక్షము కలుగనున్నచో నిత్యమందే యుండు చేపలకు, తాఁబేళ్ళకు, మొసళ్ళకు, ముందు మోక్షము కలుగవలెగదా! సుదతీ ! కల్లుకుండ యెన్నిమాఱులు కడిగిన శుద్ధి యగును? అట్లే మానసిక తీర్ధము లలవఱచుకొన్నఁ గాని బాహ్య తీర్థప్రయోజనము లేదు. దేహమునందలి యంగములకువలెఁ దీర్థముల భేదము కలదు. ఎవ్వరేమిచ్చినను బుచ్చుకొనకపోవుట, అహంకారము లేకుండుట, కోవముఁజంపుకొనుట, ఆలస్యము చేయకుండుట, సత్యనిష్ఠ, సమాధానము, శ్రద్ధ, హేతునిష్ఠ మున్నగునవెల్ల సాంగోపాంగము లై - ఫలములిచ్చును. కాని, ఎన్ని తీర్థము లైనను కాశీప్రాప్తి ఈయఁగలవు కాశికాతీర్థమాడనివాఁడు లక్షతీర్థములాడినను మోక్ష లక్ష్మీ నందలేఁ" డని యుదాహరణమునకుఁ గొన్ని పూర్వగాథ లామెకుఁ దెలి పెను.