పుట:Maharshula-Charitralu.firstpart.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహర్షుల చరిత్రలు

దధీచి మహర్షి

దధీచి జనవము

చ్యవనమహర్షి యాశ్వినుల నెపమున సుకన్యా పాతివ్రత్య ప్రభావముచే నవయౌవనుఁడు త్రిలోక సుందరుఁడునై సుకన్యను బిలిచి “సాధ్వీ ! నీవు చేసిన త్యాగ మనంతము. ఏలన, సుకుమార గాత్రివై హంసతూలికాతల్పమునఁ బరుఁడు రాజపుత్రి వగు నీవు తుచ్ఛ కామమున నీసడించి యంధుడను వృద్దునునై ననన్ను వివాహ మాడితివి మహాపతివ్రతవై నాకు యౌవనము సుందరాకారము గడించితివి. కావున, నీకు మహాత్యాగి పరమతపోధనుఁడు నగు కుమారుఁ డుదయించు" నని చెప్పి యామెతో రమించెను. అంత, సుకన్య గర్భముఁ దాల్చి యుక్తకాలమున నొక శుభ ముహూర్తమున సుపుత్త్రుని గనెను. ఆతఁడే దధీచిమహర్షి .

దధీచికి సారస్వతుఁడు జనించినవిషయము.

దధీచి బాల్యమునుండియు మహాతపస్సు చేయుచుండెను, ఆతఁడు చిరకాలము, సరస్వతీ నదీతీరమున నాశ్రమము నిర్మించుకొని యందుండెను. దధీచి తపశ్శక్తిచే నాతని దేహమెల్ల దివ్యతేజో గోశముగాఁ బ్రకాశించుచుండెను. సరస్వతీ నది యాతనిఁ జూచి సమ్మోహిత యగుచుండెడిది. ఇట్లుండఁగా దధీచిమహర్షి తపోగ్ని చే నెల్లలోకములు తల్లడిల్లుచుండెను. అందుచే నింద్రుఁ డాలోచించి యలంబుస యను నొక యప్సరసను దపోవిఘ్నమునకై యాతని కడకుఁ బంపెను.