పుట:Maharshula-Charitralu.firstpart.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

మహర్షుల చరిత్రలు

దధీచి మహర్షి సరస్వతీనదిలో స్నానముచేసి నీటిలో నిలిచి జపము చేసికొనుచుండఁగా నలంబుస యట కేఁగి తన నృత్యగీతాలాపములచే దధీచిదృష్టిఁ జూఱకొనెను. దధీచి కామమోహితుఁడు కాఁగానే యాతనివీర్యము స్ఖలితమై నదిలోఁబడెను. సరస్వతీనది సంతసముతో స్త్రీరూపధారిణియై యా వీర్యమును దనగర్భమున ధరించి గర్భవతి యయ్యెను. దధీచి యంత నిశ్చలుఁడై తనయాశ్రమమునకుఁ బోయెను. కాలక్రమమున సరస్వతి పుత్త్రునిఁగని యాతని దధీచికడకుఁ గొనిపోయి జరిగిన యుదంతమును జెప్పెను. దధీచి దివ్యదృష్టినిజూచి యది సత్య మగుట యెఱిఁగి కుమారుని ముద్దాడి యాతనికి 'సారస్వతుఁ" డను పేరిడెను. సరస్వతి పుత్త్రునిఁ గైకొమ్మని యాతని బ్రార్థించెను. దధీచి "సరస్వతీ! నేను తపోవ్రతుఁడను. కావున, వీనిని నీవే పెంచుచుండుము. ఈతఁడు మహాశక్తిసంపన్నుఁడై ముందు రాఁబోవు మహాక్షామములలో నిజశక్తిచే మహర్షుల రక్షింపఁగలఁ" డని యామెకే యప్పగించెను. ఆమె తన పవిత్రజలములచే నాతనిఁ బెంచి విడిచెను. ఆతఁడు తపోధనుఁడై తండ్రి చెప్పినట్లు మహాక్షామ కాలమున మహర్షుల నాహ్వనించి. వారందఱకు షడ్రసోపేతముగా భోజనము పెట్టుచు క్షామ నివారణము గావించెను.

దధీచి కింద్రుఁడు నేర్పిన శాస్త్రముల వృత్తాంతము

ఒకప్పు డింద్రుఁడు దధీచికడకు వచ్చి “ఋషిసత్తమా! నీవు మహాత్ముఁడవు. కావున, నీకు మహోత్తమశాస్త్రముల నుప దేశింతు" నని చెప్పి యాతనికి కొన్ని శాస్త్రము లుపదేశించెను. ఇంద్రుఁ డంతర్హితుఁ డగుచు "నీవు వీని నెవ్వరికైన నుపదేశించినచో నానాఁడే నీశిరము ఖండింతు" నని చెప్పెను. దధీచి యా శాస్త్రములను గ్రహించియుండెను. -