పుట:Maharshula-Charitralu.firstpart.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

మహర్షుల చరిత్రలు

కార్తవీర్యార్జునుఁడు బ్రహ్మానందముతో నా మాటలెల్ల విని యనంతబలసంపన్నుఁడై మాహిష్మతీపురమున కరిగి రాజ్యమును స్వీకరించెను. నాఁడు మొద లాతఁడు ధర్మబద్దముగా భూపరిపాలనము చేయుచు సనేకయజ్ఞములు చేసి బ్రహ్మర్షి పూజన మొనరించి ధర్మమును బూర్వస్థితికిఁ దీసికొనివచ్చెను. తన బాహుబలమున భూమండల మెల్ల జయించి యందెల్ల ధర్మప్రభుత్వము నెలకొల్పి కార్తవీర్యుఁడు విప్రపూజ చేయుచుండెను. ఆతఁడు ప్రతిదినమును దత్తాత్రేయమహర్షిని బూజించుచు నాతనికిఁ గృతజ్ఞుఁడై యుండెను. తుద కీతఁడు దత్తాత్రేయుఁ డన్నట్లే జమదగ్నిమహర్షి నన్యాయముగా బాధించి పరశురాముని చేతిలో జనిపోయెను.

దత్తాత్రేయుఁ డలర్కునకు జ్ఞానము బోధించుట

మదాలసా ఋతుధ్వజుల పుత్రుఁడగు నలర్కమహీపతి రాజ్యముచేయుచుఁ బురుషునకు ముముక్షను బోలిన వస్తు వొకటి లేదనియు దాని నందుటకు సత్సాఁగత్యము దక్క మార్గాంతరము లేదనియు నిశ్చయించుకొనెను. ఇంతలో విరాగియై యడవుల నున్న యీతని యన్న యాసమయముననే కాశీరాజుకడ కేఁగి తన రాజ్యము తన తమ్ముఁడపహరించినాఁ డనియు దానిని తన కిప్పింపు మనియుఁ గోరుకొనెను. కాశీరాజు సనైన్యుఁడై యలర్కుని పై దండెత్తి సామాద్యుపాయములఁ బ్రయత్నించుచుండెను. ఈ సమయమున రహస్యముగా నలర్కుఁడు దత్తాత్రేయుని కడకుఁ బరుగునఁ బోయి దండప్రణామము లాచరించి శరణార్థి యగు తనకు శరణై రక్షింపుమని పరిపరివిధముల దీనుఁడై ప్రార్థించెను. దత్తాత్రేయ మహర్షి యాతనిఁ గరుణించి "ఓయీ! వివేకహీనా! నిను నీవు తెలిసికొనుమోయీ! అంగములఁ జింతించి యంగిఁ జూచి నిరంగునిఁ గనుఁగొని యసంగుఁడవై సర్వాంగముల నుడుఁగు" మని యాతనికిఁ దత్త్వజ్ఞానోపదేశముచేసి "యిఁక విచారమే" మని యడిగెను,