పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐదవ ప్రకరణము,

21


తేగాదు. మన శాస్త్ర సముదాయమంతయు విగ్రహారాధనా శాస్త్రము లేయనియు, నిరాకారుడును నిర్వికారుడును అగు ఈశ్వరుని తత్వమును వాటి సహాయముచే తెలిసికొనుట అసంభవ మనియు నేనారోజులలో భయపడి నిరాశ చెందియుంటిని. ఇట్టి భావముతో నుండునపుడు ఒక నాడొక సంస్కృత గ్రంధములోని పుటయొకటి నాపక్క నుండి ఎగిరిపోవుచుండుట గాంచితిని. అది ఏమైయుండునాయని తీసిచూచితిని. కాని అందువ్రాసియున్న దాని అర్ధము నా కేమియు బోధ పడలేదు. దగ్గరనున్న శ్యామచరణ భట్టాచార్యునితో ఇట్లు చెప్పి తిని. " బ్యాంకు (Bank ) లో పనిముగియు వెంటనే నేనింటికి వచ్చెదను. ఈలోపున నీవీశ్లోకార్గమును గ్రహించి యంచుము. నేనువచ్చిన పిమ్మట నాకు బోధించెదవుగాక" అని బ్యాంకుకు పోతిని. నాకప్పుడు 'యూనియన్" బ్యాంకు' ( Uion Bank)లో ఒక ఉద్యోగముండెను, నాపినతండ్రి రామ నాధ ఠాకూర్ ఖజానాదారుడు. నేనాయనకు సహకారిని. ఉదయము 10 గంటలు మొదలు రోజంతయు ఆగని పనియైనంతవరకు నేనక్కడ నేయుండ వలసి వచ్చెడిది. ఆరోజు లెక్కలు సరిచూచు నప్పటికీ రాత్రి పదిగంటల య్యెను. నాడు నేనాపుటలోని సంస్కృతమునకు శ్యామచరణునివద్ద అర్థము తెలిసికొనవలసి యుండెను. గనుక యాలస్యమును సహింపలేక పోతిని. కావున మాపినతండ్రి గారివద్ద సెలవు గైకొని త్వరగా ఇంటికి వచ్చితిని. మూడవ అంతస్థు పైనున్న కచేరిసావడిలోనికి వడిగా వెళ్ళి “అర్థమును సిద్ధపరచితివా?" అని శ్యామచరణుని అడిగితిని. “అప్పటినుండియు శ్రమపడి యత్నించుచుంటిని, గాని దీని యర్ధము కొంచమైనను నాకు తెలియకున్నది.” అని అతడు బదులు చెప్పెను. నాకాశ్చర్యమైనది. ఆంగ్లేయ పండితులు. ఆంగ్ల భాషలోనున్న గ్రంధము లన్నియు గ్రహింతురే, సంస్కృతవిద్వాంసులు సంస్కృత గ్రంధములన్నియు అట్లే ఎందుకు గ్రహింపలేక పోవలెను? " అని శంక పుట్టినది.