పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్. కె. శేషాద్రి అయ్యరు

367



సాధారణముగా నూటికి రూపాయియెనిమిదణాలు, రెండురూపాయలు వడ్డికి సొమ్ముపుచ్చుకొని యాఋణము దీర్చ లేక నానాటికి దుస్థితిలోనికి వచ్చుటజూచి వారిస్థితి బాగుచేయుట కీయన యీనిధుల గల్పించెను. కాని యవి యనుకొన్నంత కార్యకారులు కాలేదు. ఇంత నతడు చేసిన ప్రయత్నములలో నెర వేరనివి కొన్ని యున్నవి, కాన నెఱవేఱిన కార్యము లనంతరములుగా నుండుటచే జెడిపోయిన వానిని మన మెత్తుకొన నక్కఱలేదు. మైసూరు నిప్పుడున్న స్థితికి దెచ్చిన మహానీయు డీయనయేయన నిశ్చయముగా జెప్పవచ్చును. శేషాద్రయ్యరుయొక్క సత్పరిపాలనము మైసూరు ప్రభువువద్దనుంచి ప్రజలవద్దనుంచి మెప్పులు దెచ్చుటయేగాక యాంగ్లేయప్రభుత్వము వారివద్దనుంచికూడ యాయనకు మెప్పులు తెచ్చెను.

1887 వ సంవత్సరము ఫిబ్రేవరు నెలలో గవర్నరు జనరలుగారగు డఫ్రిను ప్రభువుగారు మైసూరు సంస్థానమునకు బోయి మంత్రికి సి. యస్. ఐ. యన్. బిరుదమిచ్చిరి. అనంతరము 1893 వ సంవత్సరమున గవర్నరు జనరలుగారగు సెలిజిను ప్రభువుగా రాయనకు కె. సి. యన్. ఐ. యను బిరుద మిచ్చిరి. వెనుకటి మైసూరు మహారాజుగారు శేషాద్రయ్యరుకు రాజ్యధురంధరుడను బిరుదమిచ్చిరి. ఆమహారాజుగారు 1894 వ సంవత్సరమున మృతినొందగా, గుమారుఁడు బాలుఁడయి నందున నిండియాగవర్నమెంటువారు దేశపరిపాలనము జరుపుటకు కవున్సిలు ఆఫ్ రీజన్సీయను నొకసభ నేర్పరచి యాసభకు శేషాద్రయ్యరుకు నధ్యక్షునిగ నేర్పఱచిరి. చెన్నపురి యూనివరిసిటీవారు 1887 వ సంవత్సరమున నాయన నొక ఫెల్లోగా జేసిరి. నిరంతరమగు కార్యభారముచేత నాయన శరీరారోగ్యము క్రమక్రమంబునం జెడుటంజేసి యాయన 1900 సంవత్సర ప్రారంభమున నుద్యోగము మానుకొనెను. మొత్తముమీఁద నీతఁడు మైసూరు