పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

330

మహాపురుషుల జీవితములు

కైన నాగలేక యకాలమృత్యువుల పాలగుచుండుటచే నిట్టిదురాచారము ప్రపథమమున నివారింపఁబడవలసినదనియు నదియే సంస్కారములలోకల్ల సంస్కారమనియు గోపాలరావు కంఠోక్తిగఁ జెప్పుచు వచ్చెను. ఈనాటిబ్రాహ్మణులలో పడుచువాండ్రు మనఃపరిశ్రమమును గాని దేహపరిశ్రమముగాని చేయలేక చేసినమాత్రమున సొక్కి సోలి పోవుచుండుటయు పదునాఱు పదునేడేండ్లు వయసువరకు గట్టిగా కృషిచేసి విద్యాభ్యాసముచేసిన బాలురు రోగులగుటయు నాతఁడు కన్నులార జూచి యిట్లు దలంచెను. "వ్యవసాయము చేయువాఁడు తన విత్తులు మిక్కిలిమంచివై మందమశాగత్తులతో నేల సారము గలదై యున్నపుడె నాటును. బుద్ధిసూక్ష్మతగల హిందువుఁడు తన శరీరమునకీ పోలిక సరిపోవునని గ్రహింపలేక పోవుట మిక్కిలియాశ్చర్యముగా నున్న"దని యాయన చెప్పును. నిర్బంధ వైధవ్యము పాపహేతు వనియు దుస్సహమనియు గోపాలరావు మతము. బాలికలకాలమున వితంతులగుటకతిబాల్య వివాహమే ముఖ్య కారణమనియు నట్టి వివాహములు బాలికాబాలకుల యిష్టములు బడయకుండఁ దలిదండ్రులే చేయుచుండుటచేత వథూవరు లుత్తరవాదులు కారనియు నాయన వాదించుచువచ్చెను. సంఘసంస్కారమందు గోపాలరావు నేటి విద్యాధికులలో ననేకుల కంటె స్థిరాభిప్రాయములు కలిగి యుండెను. దక్షిణ హిందూస్థానమను నాకాశమండలమున సూర్యచంద్ర మండలములవలె గోపాలరావు రంగనాథ మొదలియారను వారిద్దరు నుదయించి చాలకాల మజ్ఞానాంధకారమును బారదోలి దేశస్థులభాగ్యదోషమున నకాలమున నస్తమించిరి.